Chittoor Crime : చిన్న చిన్న కారణాలతో గొడవ పడి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. క్షణికావేశంతో జైలు పాలవుతున్నారు కొందరు. చిత్తూరు జిల్లాలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో గ్రానైట్ కూలీల మధ్య గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఒడిశాకు చెందిన లక్కీరామ్ ముర్మా, సతీష్ అనే కూలీలపై మరో బావర్ సింగ్ అనే వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సతీష్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో చేస్తున్న ఈ ముగ్గురి మధ్య చపాతీలు తింటున్న సమయంలో చిన్న గొడవ జరిగింది. చేసే పని తక్కువ, తినే చపాతీలు ఎక్కువ అంటూ బావర్ సింగ్ ను సతీష్, ముర్మా హేళన చేశారట. ఈ మాటలను మనసులో పెట్టుకున్న బావర్ సింగ్, లక్కీరామ్ ముర్మా, సతీష్ నిద్రపోతున్న సమయంలో వారిపై సుత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్కీరామ్ ముర్మాకి తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముర్మా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
BREAKING NEWS