కేసు ఏంటి?
కేరళ లోని అలువ మున్సిపాలిటీ పరిధిలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని తన మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై ఐపీసీ 292 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని కోరుతూ ఆ వ్యక్తి కేరళ హై కోర్టును ఆశ్రయించాడు. ఇతరులకు బహిరంగంగా చూపించకుండా, ఆ వ్యక్తి తన ప్రైవేటు సమయంలో ప్రైవేటుగా పోర్న్ చూడడం నేరమెలా అవుతుందని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. అది అతడి వ్యక్తిగత చాయిస్ అని పేర్కొంది. అందులో జోక్యం చేసుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని ఈ కేసును విచారించిన జస్టిస్ కున్హి కృష్ణన్ స్పష్టం చేశారు. అతడు ఆ పోర్న్ వీడియో బహిరంగంగా చూపలేదని స్పష్టంగా నిరూపితమైందని, అలాగే, అతడు ఆ పోర్న్ వీడియోలు, ఫొటోలను వేరే ఎవరికీ సర్క్యులేట్ చేయలేదన్న విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. అందువల్ల ఆ చర్యను ఐపీసీ సెక్షన్ 292 కింద నేరంగా పరిగణించకూడదని తేల్చి చెప్పారు. అనంతరం, ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. అదే సమయంలో తల్లిదండ్రులకు న్యాయమూర్తి కొన్ని సూచనలిచ్చారు. పిల్లలకు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ ఫోన్ లో వారి యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.