సీఐడీ కస్టడీ పిటిషన్ రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై వాదనలు రేపటికి(బుధవారం) వాయిదా పడ్డాయి. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ ను రేపు దాఖలు చేస్తామని చంద్రబాబు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేరువేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ లో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ వేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు అయిన నాలుగు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన తరఫున లాయర్లు పిటిషన్ వేశారు.