రాజకీయ పార్టీలు-అభిప్రాయాలు
జమిలి ఎన్నికలపై దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. 2015 సెప్టెంబర్ 1 నుంచి 2018 ఆగస్టు 31 వరకు పని చేసిన 21వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై ఏడు జాతీయ, 59 ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు కోరారు. అయితే అందులో కేవలం 14 పార్టీలు మాత్రమే న్యాయ కమిషన్‌ను కలిసి, తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఐదు పార్టీలు టిఆర్ఎస్ (బిఆర్ఎస్), శిరోమణి అకాలీ దళ్, అన్నాడిఎంకె, ఎస్‌పి, వైసిపి జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. పది పార్టీలు సిపిఎం, సిపిఐ, టిడిపి, డిఎంకె, జెడిఎస్, టిఎంసి, ఆప్, ఐయుఎంఎల్, బోడో పీపుల్స్ ఫ్రంట్, గోవా ఫార్వర్డ్ పార్టీ (ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీ)లు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. 2015లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి.