అకాడమీ అవార్డును గెలుచుకోవడం ద్వారా ఇండియన్ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.. ‘జెంటిల్‌మేన్-2’ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు. త్వరలోనే కంపోజింగ్ ప్రారంభమవుతుందట. తాజాగా హైదరాబాద్‌లో ఎం.ఎం.కీరవాణిని నిర్మాత కుంజుమోన్, దర్శకుడు గోకుల్ కృష్ణ కలిసి పూర్తి స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించారు. కథ నచ్చడంతో ఈ సినిమాకు సంగీతం అందించడానికి కీరవాణి అంగీకరించారు. వచ్చే నెలలో మ్యూజిక్ కంపోజ్ చేయడం ప్రారంభిస్తానని కీరవాణి చెప్పినట్టు నిర్మాత కుంజుమోన్ వెల్లడించారు. అంతేకాకుండా, ‘జెంటిల్‌మేన్-2’ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న కుంజుమోన్‌ను కీరవాణి అభినందించారట.
ఇదిలా ఉంటే.. తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లోని ప్రముఖ నిర్మాతల్లో కె.టి.కుంజుమోన్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో కొన్ని మలయాళ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కుంజుమోన్.. ‘సూరియన్’ అనే తమిళ సినిమా ద్వారా పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. ఈ సినిమా ద్వారా శరత్‌కుమార్‌ను సోలో హీరోగా పరిచయం చేశారు. కుంజుమోన్ నిర్మించిన రెండో సినిమానే ‘జెంటిల్‌మేన్’. ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. కుంజుమోన్ నిర్మించిన సినిమాలు తక్కువే అయినా ఆయన మార్క్ మాత్రం తమిళ సినీ పరిశ్రమపై ఉండిపోయింది. ‘ప్రేమికుడు’, ‘ప్రేమదేశం’, ‘రక్షకుడు’ వంటి సినిమాలు ఆయన నిర్మించారు. నిర్మాతగానే కాకుండా కొన్ని సినిమాలకు రచయితగానూ పనిచేశారు.
అయితే, వరుస పరాజయాలు కుంజుమోన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. ముఖ్యంగా దళపతి విజయ్ హీరోగా ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కుంజుమోన్ కోలుకోలేకపోయారు. ఆ తరవాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘జెంటిల్‌మేన్’కు సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరు.. ప్రధాన తారాగణం కింద ఎవరిని తీసుకుంటున్నారు వంటి విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇది తమిళ సినిమా. తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తారు.