Tuesday, October 3, 2023

‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్: బాబోయ్.. ‘ఆర్య’లో బుడ్డోడు ‘అర్జున్ రెడ్డి’ని మించిపోయాడు!

తెలుగు సినీ చరిత్రలో ‘అర్జున్ రెడ్డి’ ఒక సంచలనం. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చని నిరూపించింది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బోల్డ్ సీన్స్ ఉన్నా కథలో బలం సినిమాను నడిపించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. అంతేకాదు, ఈ సినిమాను హిందీ సహా పలు భాషల్లో రీమేక్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ మార్క్ ఇప్పట్లో పోయే అవకాశమే లేదు. ఈ సినిమాను పోలి ఉన్న చిత్రాలు చాలా వచ్చాయి. కానీ, కంటెంట్‌లో బలం లేక అవి ఆడలేదు. అయితే, ఇప్పుడు అలాంటి ఛాయలు ఉన్న మరో సినిమా టాలీవుడ్‌లో వస్తోంది. అదే ‘సిద్ధార్థ్ రాయ్’.

‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం పొట్టపై పంచ్ ఇచ్చి.. ‘మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా’ అని డైలాగ్ చెప్పిన బుడ్డోడు గుర్తున్నాడా? ఆ బాలనటుడి పేరు దీపక్ సరోజ్. ‘ఆర్య’ సినిమాతో బాలనటుడిగా ప్రయాణం మొదలుపెట్టి పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. తన్వి నేగి హీరోయిన్. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.యేశస్వి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వస్తోన్న తొలి సినిమా ఇది.

Siddharth Roy Teaser Launch

‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్ లాంచ్ ఈవెంట్

గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన టీజర్.. హీరో పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పింది. ఎంత వైల్డ్‌గా, బోల్డ్‌గా ఉంటుందో చూపించింది. హీరో పుట్టుకతో మేధావి. లాజిక్స్‌తో బ్రతుకుతాడు. లాజిక్స్‌‌లో తనకి ఎవరూ సాటిలేరు. తిండి, నిద్ర, సెక్స్.. జీవితానికి ఈ మూడు ఉంటే చాలు అనుకుంటాడు. అయితే, తన జీవితంలోకి వచ్చిన ఒకమ్మాయి అతడిని నిజమైన ప్రేమ ఏంటో చూపిస్తుంది. ఆ తరవాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మారిందనేదే సినిమా.

‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్.. మరో ‘అర్జున్ రెడ్డి’ వస్తున్నాడు!

ఈ సినిమాలో దీపక్ సరోజ్ క్యారెక్టర్ చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ పాత్ర గుర్తొస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ‘అర్జున్ రెడ్డి’ని మించిపోయాడనిపిస్తుంది. సినిమాలో క్వాలిటీ ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మరి కంటెంట్ ఉందా లేదా అనేది రేపు థియేటర్లలోకి వచ్చిన తరవాత ప్రేక్షకులే చెబుతారు. ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్.

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో జరిగిన ‘సిద్ధార్థ్ రాయ్’ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ వర్మ దండు, నిర్మాత వంశీ, రైటర్ లక్ష్మీ భూపాల అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీజర్ అద్భుతంగా ఉందని.. సినిమాలో మంచి కంటెంట్ ఉందని అర్థమవుతోందని అందరూ అన్నారు.

ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. ‘ఆర్యలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలైయింది. లెజెండ్ సినిమాలో బాలయ్య గారి చిన్నప్పటి పాత్ర చేశాను. ప్రభాస్, మహేష్ బాబు, సుకుమార్, త్రివిక్రమ్ ఇలా ఎంతోమంది గొప్పవారితో పని చేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం. హీరోగా మంచి సినిమా చేయాలి ప్రేక్షకుల మనసులు గెలవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. దర్శకుడు యేశస్వికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కథని నమ్మి చేసిన సినిమా ఇది. ప్రతిఒక్కరూ కష్టపడి పని చేశారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. సిద్ధార్థ్ రాయ్.. పైసా వసూల్ సినిమా’ అని అన్నారు.

Latest news
Related news