Sunday, June 4, 2023

CSK vs GT Final‌కి వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టే విజేత

ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ చివరి దశకి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకి గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత మంగళవారం క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచి చెన్నై టీమ్ ఫైనల్‌కి చేరగా.. శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌ని క్వాలిఫయర్-2లో ఓడించి తుది పోరుకి గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించింది. ఓవరాల్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్, చెన్నై జట్లు ఢీకొనబోతుండటం ఇది మూడోసారి. ఇప్పటికే చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి.

అహ్మదాబాద్ పరిసరాల్లో ఆదివారం వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు కేవలం 20% అని వాతావరణ శాఖ చెప్తోంది. కానీ ముంబయి, గుజరాత్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగింది. వర్షంతో దాదాపు ముప్పావు గంట టాస్ ఆలస్యంగా పడింది. అలానే గేమ్‌ని కూడా అరగంట లేట్‌గా స్టార్ట్ చేశారు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడకపోవడంతో గేమ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 40 ఓవర్ల మ్యాచ్ జరిగి.. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరింది.

ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగిస్తే పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు శోధిస్తున్నారు. వర్షంతో 20 ఓవర్ల ఆట సాధ్యంకాకపోతే.. కనీసం 5 ఓవర్ల గేమ్‌ని ఆడించే అవకాశం ఉంది. అలా కూడా సాధ్యపడని పక్షంలో లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌ని విజేతగా ప్రకటిస్తారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచింది.

Latest news
Related news