Sunday, June 4, 2023

IPL 2023 Qualifier-2లో ఆ బౌలర్‌తో జాగ్రత్త.. ముంబయికి భజ్జీ వార్నింగ్

ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2 (IPL 2023 Qualifier 2) మ్యాచ్ ముంగిట ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టీమ్‌కి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వార్నింగ్ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబయి జట్ల మధ్య ఈరోజు రాత్రి 7:30 గంటలకి క్వాలిఫయర్ -2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అలానే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెన్నైతో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధిస్తుంది. ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది.

ముంబయి ఇండియన్స్ జట్టుకి ఈ క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో మహ్మద్ షమీ నుంచి సవాల్ ఎదురుకాబోతున్నట్లు హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ‘‘మహ్మద్ షమీ లాంటి బౌలర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది. కొత్త బంతితో అతను చాలా ప్రభావితంగా బౌలింగ్ చేస్తున్నాడు. అలానే పదునైనా యార్కర్లని కూడా డెత్ ఓవర్లలో షమీ సంధిస్తున్నాడు. బంతి స్వింగ్ అయితే అతని బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టం. అలానే షమీ సీమ్ పొజీషన్‌ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో షమీతోనే ముంబయికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటికే 15 మ్యాచ్‌లాడిన మహ్మద్ షమీ 26 వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న షమీ.. పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా. ఈ 15 మ్యాచ్‌ల్లో మొత్తం 59 ఓవర్లని షమీ వేయగా.. అతని బౌలింగ్‌ ఎకానమీ 7.66గా ఉండటం విశేషం. అలానే రెండు మ్యాచ్‌ల్లో నాలుగేసి వికెట్లని షమీ పడగొట్టాడు.

Latest news
Related news