ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ -2023 జరగనుంది. వాస్తవానికి ఈ ఆసియా కప్ పాకిస్థాన్ గడ్డపై జరగాల్సి ఉండగా అక్కడికి భారత్ జట్టుని పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో తొలుత బుజ్జగింపులు.. ఆ తర్వాత బెదిరింపులకి దిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చివరికి హైబ్రిడ్ మోడల్‌ని తెరపైకి తెచ్చింది. ఈ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌ల్ని మాత్రం యూఏఈ వేదికగా నిర్వహించి.. మిగిలిన మ్యాచ్‌లను పాక్ గడ్డపై నిర్వహిస్తామని పాక్ సూచించింది. కానీ.. బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదు. అలానే ఆసియాలోని మిగిలిన క్రికెట్ దేశాల బోర్డులు కూడా ఆ హైబ్రిడ్ మోడల్‌ని వ్యతిరేకిస్తున్నాయి. దాంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా ఆసియా కప్‌ని పాక్ గడ్డపై నిర్వహించేందుకు మొగ్గు చూపడం లేదు.
ఆసియా కప్‌ని శ్రీలంకకి తరలించాలని ఇప్పటికే ఏసీసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే అధికారిక ప్రకటనని మాత్రం ఈ నెల చివర్లో ప్రకటించనుంది. దాంతో ఆ ప్రకటనకి ముందు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఒకసారి బీసీసీఐ చర్చించి.. వేదికల్ని ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ 2023 ఫైనల్‌ని వీక్షించేందుకు ఆయా బోర్డు పెద్దలకి బీసీసీఐ సెక్రటరీ జై షా ఆహ్వానాలు పంపారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్న జై షా.. ఈ మూడు దేశాల క్రికెట్ బోర్డు పెద్దలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డుకి మాత్రం బీసీసీఐ నుంచి ఎలాంటి ఆహ్వానం వెళ్లలేదు.