Sunday, June 4, 2023

RCB టీమ్‌కి ప్లేఆఫ్స్‌కి వెళ్లే అర్హత లేదు.. నిజాయతీగా ఒప్పుకున్న డుప్లెసిస్

ఐపీఎల్ 2023 (IPL 2023) ప్లేఆఫ్స్‌లో ఆడే అర్హత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్‌కి లేదని ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ (Faf du Plessis) అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ 197 పరుగులు చేసినా.. పరాజయాన్ని చవిచూసింది. ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో విరాట్ కోహ్లీ పట్టుదలగా ఆడి 101 పరుగులు చేశాడు. కానీ బౌలర్లు తేలిపోవడంతో ఛేదనలో శతకం బాదిన శుభమన్ గిల్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌ని గెలిపించాడు. దాంతో బెంగళూరు ఇంటిబాట పట్టింది.

బెంగళూరు టీమ్ లీగ్ దశలోనే నిష్క్రమించడంపై కెప్టెన్ డుప్లెసిస్ ఎమోషనల్‌గా స్పందించారు. ‘‘హైదరాబాద్‌పై గెలిచిన తర్వాత గుజరాత్‌తో మ్యాచ్‌కి ముందు ఆర్సీబీపై అంచనాలు పెరిగిపోయాయి. టేబుల్ టాపర్ గుజరాత్‌తో ఢీకొంటున్నామని మాకు తెలుసు. కానీ.. గత రెండు మ్యాచ్‌ల్లో లభించిన జోష్‌ని ప్లేఆఫ్స్‌కి చేరేందుకు మేము కొనసాగించలేకపోయాం. గుజరాత్ లాంటి స్ట్రాంగ్ టీమ్‌తో తలపడేటప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే ఐపీఎల్ 2023లో ఉన్న బెస్ట్ టీమ్స్ జాబితాలో మేము లేము. కానీ లక్కీగా మాకు కొన్ని విజయాలు లభించాయి. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం.. ప్లేఆఫ్స్‌కి వెళ్లే అర్హత మాకు లేదు’’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సీజన్‌ని ఆర్సీబీ ముగించింది. టీమ్‌లో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, డుప్లెసిస్ 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసినా బెంగళూరుకి వరుసగా 16వ సీజన్‌లోనూ టైటిల్ కల నెరవేరలేదు.

Latest news
Related news