Sunday, June 4, 2023

రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన దినేశ్ కార్తీక్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

ఐపీఎల్ 2023లో దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బెంగళూరు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ (16)ను డీకే (17) వెనక్కి నెట్టాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన డీకే ఒక్క మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు డకౌట్ అయిన డీకే.. ఓవరాల్‌గా 140 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

మిగతా మ్యాచ్‌ల్లో రాణించకపోయినప్పటికీ.. కీలకమైన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్ ప్లేయర్ సత్తా చాటుతాడని ఆర్సీబీ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ ఆశించారు. కానీ బ్రాస్‌వెల్ ఔటయ్యాక వెంటనే డీకే కూడా పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. దీంతో దినేశ్ కార్తీక్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. దినేశ్ కార్తీక్‌పై నమ్మకం ఉంచితే నట్టేట ముంచుతున్నాడటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. డీకే చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. దినేశ్ కార్తీక్ ఆడటం మానేసి.. కామెంటేటర్‌గా పని చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
గత ఐపీఎల్ సీజన్లో దినేశ్ కార్తీక్ అదరగొట్టాడు. ఆర్సీబీకి ఫినిషర్‌గా విజయాలను అందించాడు. గత సీజన్లో 55 యావరేజ్, 183.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే టీ20 వరల్డ్ కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్‌లో కార్తీక్ రాణించలేకపోయాడు. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఆర్సీబీ యాజమాన్యం మాత్రం కార్తీక్‌పై నమ్మకం ఉంచింది.

ఫామ్‌లోకి రావడానికి తంటాలు పడుతున్న డీకే.. సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. ముంబైపై చేసిన 18 పరుగులకే అతడికి ఈ సీజన్ల హయ్యెస్ట్ స్కోర్. ఒకవేళ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయినా.. దినేశ్ కార్తీక్‌ను ఆడించకపోయినా.. అతడు ఈ సీజన్‌ను డకౌట్‌తో మొదలుపెట్టి.. డకౌట్‌తో ముగించినట్లు అవుతుంది.

Latest news
Related news