సిద్ధార్థ్, ఐశ్వర్య నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజనులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బ్రహ్మానందం రెండో కుమారుడు కూడా హీరో మెటీరియల్‌లా ఉన్నాడని అంటున్నారు. జంట చూడముచ్చటగా ఉందని కొనియాడుతున్నారు.
ఇదిలా ఉంటే, బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాతో సుమారు 19 ఏళ్ల క్రితం గౌతమ్ తెలుగు ఆడియన్స్‌కు పరిచయమ్యారు. తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఆ తరవాత చదువు కోసమని కొడుకుని సినిమాలకు దూరం పెట్టారు బ్రహ్మానందం. సుమారు పదేళ్ల విరామం తరవాత మళ్లీ గౌతమ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా సక్సెస్ కాలేకపోయారు. గౌతమ్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక రెండో కుమారుడు సిద్ధార్థ్ గురించి బయట పెద్దగా ఎవ్వరికీ తెలీదు. ఆయనకు సినిమాలపై అస్సలు ఆసక్తి లేదట. విదేశాల్లో చదువుకున్న సిద్ధార్థ్.. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ ఫొటోల ద్వారానే బ్రహ్మానందం రెండో కుమారుడిని అంత చూస్తున్నారు.
కాగా, తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ప్రస్తుతం వయోభారం కారణంగా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘రంగమార్తాండ’ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నిరోజులూ నవ్విస్తూ వచ్చిన బ్రహ్మి.. ఈ సినిమాలో మాత్రం తన నటనతో ఏడిపించేశారు. సినిమా పెద్దగా ఆడకపోయినా బ్రహ్మానందం నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఆయనలోని మరో నటుడిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ ప్రేక్షకుల ఆదరణకు మాత్రం నోచుకోలేకపోయింది.