178 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయికి ఓపెనర్లు ఇషాన్ కిషన్ (59: 39 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (37: 25 బంతుల్లో 1×4, 3×6) మెరుగైన ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కి 9.4 ఓవర్లలోనే ఈ జోడి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. రెండు ఓవర్ల వ్యవధిలోనే ఇద్దరూ ఔటైపోగా.. ఇక అక్కడి నుంచి ముంబయిలో తడబాటు మొదలైంది. సూర్యకుమార్ యాదవ్ (7), నేహాల్ వధీర (16), విష్ణు వినోద్ (2) ఫెయిలయ్యారు. కానీ.. ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన టిమ్ డేవిడ్ (32 నాటౌట్: 19 బంతుల్లో 1×4, 3×6) ముంబయిని గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ.. చివర్లో అతనికి కామెరూన్ గ్రీన్ (4 నాటౌట్: 6 బంతుల్లో) నుంచి సపోర్ట్ లభించలేదు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మోసిన్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
మ్యాచ్‌లో అంతకముందు మార్కస్ స్టాయినిస్ (89 నాటౌట్: 47 బంతుల్లో 4×4, 8×6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ కృనాల్ పాండ్య (49 రిటైర్డ్ హర్ట్: 42 బంతుల్లో 1×4, 1×6) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జేసన్ బెరండ్రాఫ్ రెండు, పీయూస్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.