Sunday, June 4, 2023

IPL 2023 ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన గుజరాత్.. హైదరాబాద్ ఔట్

ఐపీఎల్ 2023 (IPL 2023) ప్లేఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో సోమవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్.. ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 188 పరుగులు చేయగా.. ఛేదనలో హైదరాబాద్ 154/9కే పరిమితమైంది. సీజన్‌లో 13వ మ్యాచ్ ఆడిన గుజరాత్‌కి ఇది 9వ విజయంకాగా 18 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు 12వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ టీమ్ 8వ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

189 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫస్ట్ నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వెళ్లింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (4), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (5) సింగిల్ డిజిట్‌కే ఔటైపోగా.. అనంతరం వచ్చిన కెప్టెన్‌ మర్‌క్రమ్ (10)తో పాటు రాహుల్ త్రిపాఠి (1), సాన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4), మార్కో జాన్‌సెన్ (3) చేతులెత్తేశారు. దాంతో 9వ ఓవర్లు ముగిసే సమయానికి 59/7తో నిలిచిన హైదరాబాద్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో ఒంటరి పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో 4×4, 3×6).. భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో 3×4)తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే ఈ జంట మ్యాచ్‌ని గెలిపించలేకపోయింది. కానీ.. ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగింది. లాస్ట్‌లో మయాంక్ మార్కండే కూడా 9 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 18 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు పడగొట్టి హైదరాబాద్ పతనాన్ని శాసించారు. యశ్ దయాల్ ఒక వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో అంతకముందు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ (101: 58 బంతుల్లో 13×4, 1×6) సెంచరీ బాదడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శుభమన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో 6×4, 1×6) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 5 వికెట్లు పడగొట్టేశాడు. అలానే మార్కో జాన్‌సెన్, ఫరూఖి, టి. నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.

Latest news
Related news