Thursday, June 1, 2023

NTR 30: పూల చొక్కాలో ఎన్టీఆర్.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తారక్

స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూడాల్సిన పరిస్థితి టాలీవుడ్‌లో నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్టార్ హీరోలతో ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలే వస్తుండటంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా కథ దగ్గర నుంచి ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, సాంగ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందుకే, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే నెలల సమయం పడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.

RRR సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా తమ హీరో సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కి పోయింది. NTR30 ఇంకెప్పుడు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొత్తానికి మార్చి 23న సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో NTR30 ప్రారంభమైంది. దీని తరవాత షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని ఫ్యాన్స్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ అప్‌డేట్ కూడా వచ్చేసింది.

శంషాబాద్ శివారులో ఒక సెట్ వేశారు. ఈ సెట్‌లో రాత్రివేళల్లో షూటింగ్ చేస్తున్నారు. మార్చి 31 నుంచి షూటింగ్ మొదలైంది. అయితే, ఈరోజు షూటింగ్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు. కొరటాల శివతో మరోసారి సెట్స్‌ మీదికి వెళ్లడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఎన్టీఆర్. ఇక ఆయన షేర్ చేసిన వీడియోలో ఎరుపు రంగు పూలచొక్కా, రెండు చెవులకు పోగులతో కనిపించారు. ఆయన్ని కొరటాల శివ నవ్వుతూ ఆహ్వానించారు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం ఐదు భాషల్లో ఈ వీడియోను విడుదల చేశారు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ ఐదు వీడియోలను ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, NTR30 పోర్టు నేపథ్యంలో సముద్రంపై సాగే కథ అని ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ చెప్పారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి చేస్తున్న సినిమా ఇది. అందుకే, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించారు. హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ బ్రాండ్ మినిచ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇక ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నారు. అలాగే, ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నారని టాక్ నడుస్తోంది. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ఇప్పటికే ఖరారైంది. వీరిద్దరూ సినిమా ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకానుంది.

Latest news
Related news