Thursday, June 1, 2023

MS Dhoni : ఐపీఎల్ చారిత్రక రికార్డ్ ముంగిట ధోనీ.. ఈరోజు టాస్‌కి వెళ్తే చాలు!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చారిత్రక రికార్డ్ ముంగిట ఉన్నాడు. ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్‌ని ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ (MS Dhoni) టాస్‌కి వెళితే? 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓల్డెస్ట్ కెప్టెన్‌గా ఘనత సాధించనున్నాడు. ధోనీ వయసు 41 ఏళ్ల 267 రోజులు.

2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కెప్టెన్‌గా ఇప్పటికే నాలుగు సార్లు విజేతగా నిలిపాడు. కానీ ఈరోజు మ్యాచ్‌లో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రెండు రోజుల క్రితం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ధోనీ ఎడమ కాలికి గాయమైంది. దాంతో మైదానంలో అసౌకర్యంగా నడుస్తూ కనిపించిన ధోనీ 100% ఫిట్‌గా లేడని తెలుస్తోంది. కానీ.. ఈరోజు మ్యాచ్‌లో ధోనీ ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో ఓల్డెస్ట్ కెప్టెన్ రికార్డ్‌ ఇప్పటి వరకు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ 40 ఏళ్ల 268 రోజుల వయసులో కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్ జట్టుని నడిపించాడు. అయితే.. తాజాగా ఆ రికార్డ్‌ని ధోనీ బద్దలు కొట్టబోతున్నాడు. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అప్పటి నుంచి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 234 మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోనీ 135.2 స్ట్రైక్‌రేట్‌తో 4978 పరుగులు చేశాడు. ఈరోజు మ్యాచ్‌లో ధోనీ 22 పరుగులు చేస్తే? 5వేల పరుగుల ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news