Sunday, April 2, 2023

RCB WPL 2023: లాస్ట్‌లో చేతులెత్తేసిన బెంగళూరు బౌలర్.. 189 టార్గెట్ ఇచ్చిన గుజరాత్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023(WPL 2023)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఒక మ్యాచ్ వ్యవధిలోనే మళ్లీ పాత బాట పట్టారు. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రెండు రోజుల క్రితం గెలుపు రుచి చూసిన ఆర్సీబీ (RCB) టీమ్ ముందు శనివారం 189 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జెయింట్స్ టీమ్ నిలిపింది. ఆ జట్టులో ఓపెనర్ లూరా వోల్వార్డ్ (68: 42 బంతుల్లో 9×4, 2×6) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. గార్డ్‌నర్ (41: 26 బంతుల్లో 6×4, 1×6) కూడా దూకుడుగా ఆడింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి గుజరాత్ టీమ్ 188 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సోఫియా డివైన్, ప్రీతి బోస్ చెరో వికెట్ పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్‌కి రెండు వికెట్లు దక్కాయి.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ సోఫియా డంక్లీ (16: 10 బంతుల్లో 3×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. కానీ.. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన సబ్బినేని మేఘన (31: 32 బంతుల్లో 4×4)తో కలిసి మరో ఓపెనర్ లూరా దూకుడుగా ఆడేసింది. ఆ తర్వాత వచ్చిన గార్డ్‌నర్‌.. చివర్లో హేమలత (16 నాటౌట్: 6 బంతులో 2×4, 1×6), హర్లీన్ డియోల్ (12 నాటౌట్: 5 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్ ఝళిపించారు. దాంతో గుజరాత్ మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.

ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన స్కాట్ బౌలింగ్‌లో హర్లీన్ డియోల్ ఒక ఫోర్, సిక్స్ కొట్టగా.. హేమలత కూడా ఒక ఫోర్, సిక్స్ కొట్టింది. దాంతో ఓవరాల్‌గా ఆ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. మ్యాచ్‌లో ఈ ఓవర్ కీలకంకాబోతోంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ 2023 ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టంగా మార్చుకున్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఓడితే? సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించనుంది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news