Visakhapatnam ODI: ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో వన్డే (IND vs AUS 2nd ODI)లో భారత్ జట్టు తడబడింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 26 ఓవర్లలోనే 117 పరుగులకి ఆలౌటైంది. జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (31: 35 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (29 నాటౌట్: 29 బంతుల్లో 1×4, 2×6) బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో కాసేపు ఫ్యాన్స్‌ని అలరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్కార్క్ (Mitchell Starc) 5 వికెట్లు పడగొట్టగా.. సీన్ అబాట్ మూడు, నాథన్ ఎలిస్ రెండు వికెట్లు పడగొట్టారు. వాంఖడే వేదికగా గత శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకి ఆలౌట్ చేసిన టీమిండియా.. 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే.
ఈరోజు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ (15), శుభమన్ గిల్ (0)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (0), కేఎల్ రాహుల్ (9) వరుస ఓవర్లలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకి పెవిలియన్‌కి చేరిపోయారు. ఈ దశలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. అతనికి హార్దిక్ పాండ్య (1) కనీస సహకారం కూడా అందించలేకపోయాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లీ ఆరో వికెట్ రూపంలో ఔటయ్యే సమయానికి భారత్ జట్టు 15.2 ఓవర్లలో 71/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (16: 39 బంతుల్లో 1×4), అక్షర్ పటేల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని పరుగులు చేశారు. కానీ.. జడేజాని ఎలిస్ ఔట్ చేసేయగా.. ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ (4), మహ్మద్ షమీ (0), మహ్మద్ సిరాజ్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. లాస్ట్ వికెట్‌కి ముందు మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి ఫ్యాన్స్‌ని అలరించాడు.
Read Latest Sports News, Cricket News, Telugu News