Friday, March 31, 2023

India vs Australia : ఔరా షమీ, సిరాజ్.. 24 బంతులు నో రన్.. 5 వికెట్లు

India vs Australia 1st ODI : ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వరుస వికెట్లతో చెలరేగారు. దెబ్బకి మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ( Australia) జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకి ఆలౌటైంది. వాస్తవానికి ఓపెనర్ మిచెల్ మార్ష్ (81: 65 బంతుల్లో 10×4, 5×6) ఆరంభం నుంచి భారత్ బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీ షాట్లు ఆడేశాడు. కానీ.. అతడ్ని టీమ్ స్కోరు 128 పరుగుల వద్ద ఔట్ చేసిన రవీంద్ర జడేజా.. భారత్‌ బౌలర్లకి ఊరటనిచ్చాడు. ఇక అక్కడి నుంచి షమీ (Shami), సిరాజ్ (Siraj) పదునైన బంతులతో ఆస్ట్రేలియాని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఎంతలా అంటే? ఇద్దరూ కలిసి కేవలం 11.4 ఓవర్లు బౌలింగ్ చేయగా.. ఇందులో మూడు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. అలానే 46 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? సిరాజ్ మ్యాచ్‌లో వేసిన చివరి 10 బంతుల్లో కనీసం ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అలానే ఈ 10 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు షమీ 14 బంతుల్లో పరుగు ఇవ్వకుండా ఏకంగా 3 వికెట్లు తీశాడు. ఓవరాల్‌‌గా 24 బంతుల్లో పరుగు ఇవ్వకుండా ఈ ఇద్దరు పేసర్లు 5 వికెట్లు పడగొట్టారు.

షమీ, సిరాజ్ దెబ్బకి ఆస్ట్రేలియా టీమ్ చివరి 8 వికెట్లనీ కేవలం 59 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ ఈ ఇద్దరు బౌలర్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. వాంఖడే వన్డేలో రైట్ ఏరియాస్‌లో బంతులు విసరడంతోనే ఈ ఫలితం వచ్చిందని ఇన్నింగ్స్ తర్వాత షమీ చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news