మొగిలయ్యకు కిడ్నీలు ఫెయిల్ అవడంతో డయాలిసిస్ చేయించుకుంటున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ వేణు.. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండల కేంద్రంలోని మొగిలయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సాయంతో పాటు ఉచితంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొమురవ్వ, మొగిలయ్యను డైరెక్టర్ వేణు తన మిత్ర బృందంతో కలిసి ఘనంగా సత్కరించారు.
డైరెక్టర్ వేణు స్వస్థలం సిరిసిల్ల కాగా.. అక్కడి నాయకులతో పాటు లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల, యాంకర్ గీత భగత్ కలిసి రూ.70 వేలు ఆర్థిక సాయాన్ని మొగిలయ్యకు అందించారు. అలాగే మరో రూ.30 వేలు బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తామని మనోధైర్యాన్ని కల్పించి వారితో కలిసి భోజనం చేశారు. నిర్మాత దిల్ రాజు కు సైతం తెలియజేసి ఆర్థిక సాయం ఇప్పిస్తామని తెలిపారు. కాగా.. దుగ్గొండిని సందర్శించిన వేణు బృందాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సీఐ పులి రమేష్ కూడా పాల్గొని బుర్రకథ కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలను అభినందించారు. దుగ్గొండి పేరును ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారని వారిని ప్రశంసించారు.
ఇక ‘బలగం’ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే బుర్రకథ పాటకు కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అంత ఆర్ధ్రతతో ఆలపించి సినిమా విజయంలో కొమురవ్వ, మొగిలయ్య కీలక పాత్ర పోషించారు. ఈ పాట చిత్రీకరణ సమయంలోనూ కొమురవ్వ పాడుతూనే ఎమోషనల్ అయిందంటూ పలు ఇంటర్వ్యూల్లో వేణు చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. మరుగున పడిపోతున్న ఇలాంటి కళాకారులను సినిమా ద్వారా వెలుగులోకి తెచ్చిన వేణు.. ఇప్పుడు మానవత్వంతో వారిని ఆదుకోవడం నిజంగా ప్రశంసనీయమే.
- Read latest Tollywood updates and Telugu News