Friday, March 24, 2023

RCB టీమ్‌కి గాయం దెబ్బ.. ఐపీఎల్ 2023 ముంగిట యంగ్ ఆల్‌రౌండర్ ఔట్!

ఐపీఎల్ 2023 ముంగిట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఆర్సీబీ (RCB) టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌ని ఏప్రిల్ 2న ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2019, మే తర్వాత మళ్లీ సొంతగడ్డపై మ్యాచ్ ఆడబోతున్న బెంగళూరు టీమ్‌కి ఫస్ట్ మ్యాచ్‌కు ముందే గాయం దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ విల్ జాక్స్ (Will Jacks) గాయంతో ఐపీఎల్ 2023 మొత్తానికీ దూరమైపోయాడు.

ఇంగ్లాండ్‌కి చెందిన 24 ఏళ్ల విల్ జాక్స్ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని పవర్ హిట్టింగ్ స్కిల్స్, ఆఫ్ స్పిన్ మ్యాజిక్ చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ 2023 ఆటగాళ్ల వేలంలో రూ. 3.2 కోట్లకి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ తరఫున కేవలం 2 టీ20లే ఆడిన విల్ జాక్స్ 40 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆల్‌రౌండర్‌గా జట్టుకి విల్ జాక్స్ ఉపయోగపడతాడని ఆర్సీబీ ఆశించింది.

కానీ.. బంగ్లాదేశ్‌తో ఇటీవల మీర్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా విల్ జాక్స్‌కి గాయమైంది. ఈ నేపథ్యంలో స్కానింగ్ తీయించుకోగా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో వైద్యుల సూచనల మేరకు ఐపీఎల్ 2023 మొత్తానికీ అతను దూరమయ్యాడు. ఐపీఎల్ 2023లో సత్తాచాటడం ద్వారా ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ -2023కి ఇంగ్లాండ్ జట్టులోకి ఎంపికవ్వాలని విల్ జాక్స్ ఆశించాడు.

విల్ జాక్స్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రాస్‌వెల్‌ని జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ ఆశిస్తోంది. గత ఏడాది న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రాస్‌వెల్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌‌పై వన్డే, టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పటి వరకు 16 టీ20లు ఆడిన బ్రాస్‌వెల్ 21 వికెట్లు పడగొట్టాడు. కానీ కేవలం 113 పరుగులే చేశాడు. వాస్తవానికి రూ.1 కోటి కనీస ధరతో బ్రాస్‌వెల్ గత ఏడాది వేలంలోకి వచ్చాడు. కానీ ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు కనీస ధర చెల్లించి అతడ్ని ఆర్సీబీ ఆడించుకునే అవకాశం ఉంది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news