ఆర్ధిక శాఖ అధికారులతో బడ్జెట్ ప్రతుల్ని చూపుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.2.79లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని భావిస్తున్నారు. శాసనసభలో ఆర్ధికమంత్రి బుగ్గన, మండలిలో డిప్యూటీ సిఎం అంజాద్ పాషా ప్రవేశపెడతారు.
బడ్జెట్ ప్రతులకు పూజలు చేసిన ఆర్ధిక మంత్రి
సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి. ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు హాజరయ్యారు.
అందరకీ లబ్ది చేకూర్చేలా బడ్జెట్ ఉంటుందన్న బుగ్గన
పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి బడ్జెట్‍లో కేటాయింపులు చేసినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. పేదలు, బలహీనవర్గాలకు బడ్జెట్‍లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. – ఉన్న పథకాలను బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చేలా కేటాయింపులు చేసినట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
నవరత్నాలకు ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో నవరత్నాలకు ప్రాధాన్యతనిచ్చేలా రూపకల్పన చేశారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు.
మంత్రి మండలి భేటీ
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉదయం మంత్రి మండలి సమావేశం కానుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు.
అన్ని వర్గాలకు ఉండేలా బడ్జెట్
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐదోసారిఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయనుంది. నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
రూ.2.79 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
2023-24 ఆర్ధిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మరికాసేపట్లో ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపుతారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లకు పెద్దపీట వేయనున్నారు.