Friday, March 31, 2023

Steve Smith: ఆస్ట్రేలియా సారథిగా స్మిత్.. ఐదు వన్డేల్లో నలుగురు కెప్టెన్లు!

బాల్ ట్యాంపరింగ్ వివాదానికి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్.. మరోసారి ఆసీస్ సారథిగా పగ్గాలు చేపడుతున్నాడు. టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోనే ఆస్ట్రేలియా భారత గడ్డ మీదకు అడుగు పెట్టింది. కానీ తన తల్లి అనారోగ్యం, మరణం కారణంగా టెస్టు సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వన్డే సిరీస్ కోసం భారత్‌కు రావడం లేదని చెప్పేశాడు. దీంతో చివరి రెండు టెస్టుల్లో ఆసీస్‌ను ముందుకు నడిపిన స్టీవ్ స్మిత్ చేతికే వన్డే జట్టు పగ్గాలు కూడా దక్కనున్నాయి.

సౌతాఫ్రికా గడ్డ మీద బ్యాల్ ట్యాపరింగ్ వివాదం, ఆ తర్వాత కెప్టెన్సీపై నిషేధంతో.. మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం స్టీవ్ స్మిత్‌కు ఇష్టం లేదు. తన కెప్టెన్సీ గడిచిపోయిన వ్యవహారం అని మీడియా ముఖంగా చెప్పేశాడు కూడా. కానీ స్మిత్‌కు మాత్రం కెప్టెన్సీ చేయక తప్పడం లేదు.

ఆస్ట్రేలియా స్మిత్ సారథ్యంలో భారత్‌తో తొలి వన్డే ఆడితే.. ఆ జట్టుకు ఐదు వన్డేల్లోనే నలుగురు కెప్టెన్లు మారినట్లు అవుతుంది. సెప్టెంబర్లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ సమయంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా కమిన్స్ పేరును ప్రకటించారు. నవంబర్లో ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు కమిన్స్‌కు విశ్రాంతి ఇవ్వడంతో జోష్ హేజిల్‌వుడ్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించాడు. గాయం కారణంగా భారత పర్యటనకు హేజిల్‌వుడ్ దూరం కావడంతో.. ఈసారి స్మిత్‌ను ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా ప్రకటించారు. చూడబోతుంటే.. తనకు కెప్టెన్సీ వద్దని స్మిత్ చెప్పినప్పటికీ.. ఆస్ట్రేలియాకు మాత్రం స్మిత్ కెప్టెన్సీ తప్పదేమో అనిపిస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కేరీ, నాథన్ ఇల్లీస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషానే, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

Latest news
Related news