Friday, March 24, 2023

Chiranjeevi – నా వైద్యానికి రూ.45 లక్షలు ఖర్చయ్యింది.. మొత్తం చిరంజీవి అన్నయ్యే ఇచ్చారు: పొన్నంబలం

నటుడు పొన్నంబలం (Ponnambalam) తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన విలన్. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు ఆయన విలన్‌గా నటించారు. తెలుగులోనూ ఈయన పాపులారిటీకి డోకా ఏమీ లేదు. 1990 కాలం నుంచే తెలుగులో పొన్నంబలం విలన్‌గా రాణించారు. ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తనదైన నటన, శైలితో ఆకట్టుకున్నారు. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో తన్నులు తిన్నారు.

అయితే, కోలీవుడ్‌లో తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పొన్నంబలం అనుకోకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. ఇక ఆయన్ని అందరూ మరిచిపోయారు అనుకున్న సమయంలో సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్‌ షోలోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2018లో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో పొన్నంబలం పాల్గొన్నారు.

అయితే, రెండేళ్ల క్రితం పొన్నంబలం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు పొన్నంబలం. వైద్యానికి సరిపడా డబ్బులు తన దగ్గర లేకపోవడంతో సాయం చేయాలని అర్థించారు. ఆయనకి సాయం చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ముందుకొచ్చారు. అలా సాయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.

తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నంబలం.. ఆయనకు ఒక మెసేజ్ చేశారట. ‘అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నంబలానికి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నంబలం స్వయంగా వెల్లడించారు. చిరంజీవి తనకు చేసిన సాయం గురించి బిహైండ్‌వుడ్స్ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు పొన్నంబలం.

‘‘హాయ్ పొన్నంబలం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది’’ అని పొన్నంబలం భావోద్వేగానికి గురయ్యారు. పొన్నంబలం మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే, నటుడు శరత్‌కుమార్ తనకు సోదరుడిలా సాయం చేస్తున్నారని పొన్నంబలం చెప్పారు. ‘శరత్‌కుమార్ నా పరిస్థితి గురించి ఇండస్ట్రీలోని ప్రముఖులకు చెప్పి నాకు సహాయం చేయమని కోరారు. కెఎస్ రవికుమార్, కమల్ హాసన్, ధనుష్ ఇలా చాలా మంది నన్ను సినిమాల్లో నటించడానికి సహాయం చేస్తారని చెప్పారు. ఇప్పుడు నాకు గడ్డం ఉంది కాబట్టి నేను కొన్ని పాత్రలకు సరిపోతాను. తండ్రి, అన్నయ్య ఇలా ఎలాంటి పాత్రనైనా పోషించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అని పొన్నంబలం చెప్పుకొచ్చారు.

Latest news
Related news