DICGC: ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకుంటే దొంగలు పడి దొచుకెళ్లే ప్రమాదం ఉందని బ్యాంకులో దాచుకుంటాం. బ్యాంకులో డబ్బులుంటే భద్రంగా ఉంటాయని, అవసరమైనప్పుడు తీసుకోవచ్చనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిందే. అయితే, ఒకవేళ మనం డబ్బులు దాచుకున్న బ్యాంక్ దివాలా తీస్తే పరిస్థితి ఏమిటి? ఇటీవలే అమెరికాకు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా (
Bankruptcy) తీసిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం ప్రపంచ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే బ్యాంకులు దివాలా తీస్తే మన డబ్బులు మొత్తం తిరిగి వస్తాయా? అనే ప్రశ్న కస్టమర్ల మదిలో మెదులుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ఏం చెబుతోంది. డిపాజిటర్ల రక్షణకు ఉన్న అవకాశాలేమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కస్టమర్లకు బ్యాంకులో దాచుకున్న తమ డబ్బులకు ఇన్సూరెన్స్ భద్రత ఉంటుంది. ఈ సదుపాయం ఎలాంటి రుసుములు చెల్లించకుండానే వర్తిస్తుంది. దీనికి ప్రీమియం బ్యాంకులే చెల్లిస్తాయి. ఒక వేళ బ్యాంకు దివాలా తీసి మూసివేసినా, లేదా ఇతర కారణాల వల్ల కస్టమర్లు నష్టపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అయితే, ఈ పరిహారం గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. అంటే బ్యాంకులో ఎంత దాచుకున్నా మీకు రూ. 5 లక్షల వరకు మాత్రమే అందుతాయి. ఒకే బ్యాంకులో వివిధ శాఖల్లో ఖాతాలు ఉన్నా అంతే మొత్తంలో మీకు పరిహారం లభిస్తుంది.
డీఐసీజీసీ అంటే ఏమిటి?
బ్యాంకు దివాలా తీసినప్పుడు, ఇతర కారణాల వల్ల కస్టమర్లు నష్టపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (Deposit Insurance and Credit Guarantee Corporation) భద్రత కల్పిస్తుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో అనుబంధంగా, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటుంది. దేశంలోని అన్ని వాణిజ్య, విదేశీ బ్యాంకుల్లోని డిపాజిటర్ల డబ్బుకు డీఐసీజీసీ బీమా రక్షణ అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర, పట్టణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కవర్ తప్పకుండా తీసుకోవాలి. బ్యాంకుల్లోని సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని డిపాజిట్లపైనా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
బ్యాంకుల్లోని డబ్బులకు బీమా పరిమితి రూ.5 లక్షలు మాత్రమే ఉంటుంది. కాబట్టి అంతకు మించి బ్యాంకులో డబ్బులు దాచుకోవడం రిస్క్‌తో కూడుకున్న పనిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీరు రూ.10 లక్షలపైన డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులను అందులో భాగస్వాములను చేయడం ద్వారా మీకు పూర్తి బీమా వర్తిస్తుంది.
SVB Crisis: అతిపెద్ద బ్యాంక్ దివాలా.. లక్ష ఉద్యోగాలు గోవింద.. 10 వేల స్టార్టప్‌లపై ప్రభావం!
Signature Bank: బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు.. కుప్పకూలిన మరో బ్యాంక్.. మూసివేత.. డిపాజిటర్లకు బైడెన్ హామీ!