Thursday, March 30, 2023

Tamanaah: స్కూల్‌లో చాలామంది చిన్న చూపు చూసేవారు: తమన్నా భాటియా

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు పొందిన తమన్నా భాటియా (Tamannah Bhatia) ఈ మధ్య బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది. గతేడాది చివరన ‘బబ్లీ బౌన్సర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇదిలా ఉంటే, బీటౌన్ యాక్టర్ విజయ్ వర్మతో (Vijay Varma) రిలేషన్‌షిప్ రూమర్స్ కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న తమన్నా.. రీసెంట్ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ డేస్ గుర్తుచేసుకుంది. 15 ఏళ్ల వయసులోనే ఆమె యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టగా.. అప్పటి నుంచి తన జర్నీ ఎలా సాగిందో షేర్ చేసుకుంది. అలాగే వివక్ష, స్త్రీద్వేషాన్ని ఎదుర్కోవడం నుంచి బాడీ షేమింగ్ వరకు మరెన్నో విషయాలపై మాట్లాడింది.

యాక్ట్రెస్ కావాలనుకున్నప్పుడు జనాలు తనను ఎలా చిన్నచూపు చూసేవారో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది తమన్నా. అంతేకాదు షూటింగ్స్‌తో పాటు స్టడీస్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకునేదో కూడా చెప్పింది. అయితే జనాల సంగతి పక్కనపెడితే నటిని కావాలనే తన కోరికను పేరెంట్స్‌ ఎప్పుడూ విశ్వసించేవారని చెప్పుకొచ్చింది. తాను యాక్టింగ్ జర్నీ మొదలుపెట్టినపుడు మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, శ్రీదేవి వంటి తారలను ఆరాధించేదాన్నని తెలిపింది. మొట్టమొదట తమన్నా కమర్షియల్ యాడ్‌లో నటించగా.. బోర్డ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ ఆఫర్ వచ్చిందట. అయితే ఎగ్జామ్స్, యాక్టింగ్ ఆఫర్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనే కన్‌ఫ్యూజన్ తర్వాత.. రెండింటినీ ఎందుకు చేయకూడదని సరిగ్గా బ్యాలన్స్ చేసుకున్నట్లు తెలిపింది. డే టైమ్‌లో షూటింగ్‌లో పాల్గొంటూ, రాత్రి చదువుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ను ఎప్పుడూ వదులుకోలేదని చెప్పింది తమన్నా. ఇక అవకాశాలు వస్తున్నప్పుడు ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడలేదని చెప్పింది. స్కూల్‌లో ఉన్నప్పుడు చాలా మంది తాను నటిని కావాలనుకుంటున్నాను అంటే చిన్నచూపు చూసేవారని తెలిపింది. పేరెంట్స్‌కు కూడా చాలా సామాజిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కెరీర్ స్టార్టింగ్ చేసినపుడు తాను ఇవన్నీ ఫేస్ చేశానని పేర్కొంది. ముఖ్యంగా పురుషాధిక్య సమాజంలో మహిళలకు తాము అనుకున్నది చేయాలంటే కష్టమని తెలిపింది. ఈ విషయంలో మాత్రం తాను అదృష్టవంతురాలినని, పేరెంట్స్ తనకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించింది.

సినిమాల విషయానికొస్తే.. తమన్నా తెలుగులో చిరంజీవితో ‘భోలా శంకర్’తో పాటు తమిళ్‌లో సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ పక్కన ‘జైలర్’ చిత్రంలో నటిస్తోంది. ఇవేగాక హిందీలో ‘లస్ట్ స్టోరీస్2’ వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. ఇదిలా ఉంటే గతేడాది సత్య దేవ్‌తో కలిసి నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

Latest news
Related news