Tuesday, March 21, 2023

Anni Manchi Sakunamule Teaser: ‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో ఆహ్లాదకరమైన చిత్రం

యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’ కాగా.. మరొకటి సుస్మితా కొణిదెల రూపొందించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే, జయాపజయాలతో సంబంధం లేకుండా సంతోష్ శోభన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటించిన మరో చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule).

‘సీతారామం’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమా నుంచి ‘అన్నీ మంచి శకునములే’ సినిమా వస్తోంది. ఈ సినిమాకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘అన్నీ మంచి శకునములే’ టీజర్‌ను విడుదల చేశారు. ‘సీతారామం’ హీరో దుల్కర్ సల్మాన్ ఈ టీజర్‌ను లాంచ్ చేయడం విశేషం.

టీజర్ చూస్తుంటే వైజయంతీ మూవీస్ కాంపౌండ్ నుంచి మరో మంచి సినిమా రాబోతోందని అర్థమవుతోంది. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, చక్కని హాస్యంతో చూడముచ్చటగా ఉంది. భారీ తారాగణం టీజర్‌కు నిండుతనాన్ని తీసుకొచ్చింది. టీజర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా బాగుంటుందని అనిపిస్తోంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్‌కు జంటగా మాళవికా నాయర్ నటించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జునైద్ ఎడిటర్. లక్ష్మీ భూపాల మాటలు రాశారు.

టీజర్‌లో పాత్రలు చూస్తుంటే కృష్ణవంశీ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. నందిని రెడ్డి కూడా కృష్ణవంశీ శిష్యురాలే. కానీ, ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలోనూ అలాంటి ఛాయలు కనిపించలేదు. కానీ, ఎమోషన్స్‌ను చూపించడంలో నందిని రెడ్డి దిట్ట. ‘ఓ బేబీ’ సినిమాలో రావు రమేష్, సమంత మధ్య పండిన తల్లీకొడుకు భావోద్వేగాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాయి. ఈ సినిమాలోనూ ఎమోషన్స్‌కు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వేసవిలో చల్లని చిరుగాలి లాంటి సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు నిర్మాత ప్రియాంక దత్, దర్శకురాలు నందిని రెడ్డి సిద్ధమవుతున్నారు. మే 18న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

‘అన్నీ మంచి శకునములే’ టీజర్.. హాయిగా సాగిపోయే ఫ్యామిలీ డ్రామా

Latest news
Related news