Tuesday, March 21, 2023

Manchu Manoj Marriage: దగ్గరుండి చిన్న కొడుకు రెండో పెళ్లి చేసిన మోహన్ బాబు.. ఆ పుకార్లకు చెక్

సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. భూమా మౌనికా రెడ్డిని (Bhuma Mounika Reddy) ఆయన వివాహం చేసుకున్నారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె ఈ భూమా మౌనికా రెడ్డి. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఘనంగా జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేసి ఆమెను భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.

పుకార్లకు ఫుల్‌స్టాప్

పుకార్లకు ఫుల్‌స్టాప్

మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త గత నాలుగైదు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి 3న మనోజ్, మౌనిక పెళ్లి జరగనుందని.. 1, 2 తేదీల్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయని వివరాలు బయటికి వచ్చాయి. ఇదే సమయంలో మరో వార్త మీడియాలో గట్టిగా వినిపించింది. అసలు ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని.. భూమా మౌనికా రెడ్డి టీడీపీ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె కాబట్టి ఆమెను మోహన్ బాబు కోడలిగా స్వీకరించడానికి సిద్ధంగా లేరని.. అందుకే వీరి పెళ్లి కూడా ఆయన హాజరుకాబోరని.. రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే, అవన్నీ అవాస్తవాలని ఈరోజు రుజువైంది. మోహన్ బాబు దగ్గరుండి తన చిన్న కొడుకు రెండో పెళ్లిని ఘనంగా జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చూడముచ్చటగా కొత్త జంట

చూడముచ్చటగా కొత్త జంట

మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి మంచు మనోజ్ 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన మళ్లీ పెళ్లిచేసుకోరా అనే విషయంపై చాలా చర్చ జరిగింది. ఆయన అభిమానులు సైతం ‘అన్న మళ్లీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్ననే ఎక్కువగా సోషల్ మీడియాలో అడిగేవారు. మొత్తానికి తన జీవిత భాగస్వామిగా భూమా మౌనికా రెడ్డిని మనోజ్ ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా పెళ్లి బట్టల్లో మనోజ్, మౌనిక జంట మెరిసిపోతోంది. బంగారు వర్ణం పట్టు కుర్తా, దోతిలో మంచు మనోజ్ మెరవగా.. ఆకుపచ్చ, గులాబీ వర్ణం పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించారు.

లక్ష్మీ ప్రసన్నే పెళ్లి పెద్ద

లక్ష్మీ ప్రసన్నే పెళ్లి పెద్ద

మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు హైదరాబాద్‌లోనే ఉన్నా మనోజ్ పెళ్లికి మాత్రం అక్క మంచు లక్ష్మీ ప్రసన్న పెద్దరికం చేసినట్టు సమాచారం. ఆమె ఆధ్వర్యంలోనే పెళ్లి పనులన్నీ జరిగాయట. అంతెందుకు పెళ్లి కూడా ఆమె ఇంట్లోనే జరిగింది. తమ్ముడు రెండో పెళ్లి తన చేతుల మీదుగా జరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు లక్ష్మీ ప్రసన్న. అందుకే, మనోజ్ సైతం అక్క అన్ని పనులు దగ్గరుండి చూసుకోవడంతో థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏ జన్మ పుణ్యమో నీకు తమ్ముడిగా పుట్టాను అంటూ అక్కపై ప్రేమను చాటుకున్నారు.

బంధుమిత్రుల సమక్షంలో..

బంధుమిత్రుల సమక్షంలో..

మనోజ్, మౌనిక వివాహ వేడుకకు ఇటు మంచు కుటుంబ సభ్యులతో పాటు అటు భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. ఈ ఇరుకుటుంబాల సభ్యులే కాక ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా పెళ్లివేడుకలో పాల్గొన్నారు. మూడుముళ్లు వేసిన తరవాత మనోజ్, మౌనిక తలంబ్రాలు వేసుకుంటుంటే కుటుంబ సభ్యులందరూ కెమెరాలకు పనిచెప్పారు. ఈ మధుర క్షణాలను తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించారు.

హాజరైన అఖిలప్రియ దంపతులు

హాజరైన అఖిలప్రియ దంపతులు

మనోజ్, మౌనిక వివాహ వేడుకలో భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ ఆమె భర్త భార్గవ రామ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ దంపతులతో పాటు భూమా కుటుంబసభ్యులంతా కలిసి కొత్త జంటతో ఫ్యామిలీ ఫొటో దిగారు. ఈ ఫొటోలో కొత్త పెళ్లికూతురు మౌనిక.. అక్క చేయిని పట్టుకుని కనిపించారు. మౌనికకు కూడా ఇది రెండో పెళ్లే. ఆమె గతంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొడుకు పుట్టిన తరవాత మనస్పర్థలతో గణేష్ నుంచి విడిపోయారు.

Latest news
Related news