Thursday, March 30, 2023

Indore Pitch Rating | ఇండోర్ పిచ్‌కి పూర్ రేటింగ్.. ఐసీసీకి సునీల్ గవాస్కర్ చురకలు

IND vs AUS 3rd Test : భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ (Indore) వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ కేవలం రెండన్నర రోజులోనే ముగిసింది. పిచ్ నుంచి స్పిన్నర్లకి అతిగా సహకారం లభించగా.. ఇరు జట్ల బ్యాటర్లూ క్రీజులో తడబడ్డారు. మరీ ముఖ్యంగా.. భారత క్రికెటర్లలో చతేశ్వర్ పుజారా (Pujara) మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దాంతో పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పిచ్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పూర్ రేటింగ్ ఇచ్చింది. దాంతో మూడు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చాయి.

ఇండోర్ టెస్టుకి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు. అతను ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ‘పిచ్ చాలా డ్రైగా కనిపించింది. బ్యాట్, బాల్ మధ్య బ్యాలెన్స్ అస్సలు లేదు. మ్యాచ్ ఆరంభం నుంచే స్పిన్నర్లకి పిచ్ నుంచి సహకారం లభించింది. గేమ్‌ స్టార్టింగ్‌లోనే ఐదో బంతికే పిచ్‌పై పగుళ్లు దర్శనమిచ్చాయి. అలానే అస్థిర బౌన్స్ కూడా పిచ్‌పై కనిపించింది’ అని ఐసీసీకి మ్యాచ్ రిఫరీ క్రిస్‌ బ్రాడ్ నివేదిక ఇచ్చాడు. ఇండోర్ పిచ్‌కి పూర్ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. మూడు డీమెరిట్ పాయింట్లని కూడా కేటాయించింది. ఈ పాయింట్ల సంఖ్య ఐదుకి చేరితే.. ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఇండోర్ స్టేడియం కోల్పోతుంది.

ఇండోర్ పిచ్‌కి పూర్ రేటింగ్ ఇవ్వడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డాడు. ‘‘నేను ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. గత ఏడాది చివర్లో బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్ (గబ్బా) లో ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. అది కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అప్పట్లో ఎన్ని డీమెరిట్ పాయింట్లు గబ్బాకి ఇచ్చారు? ఆ మ్యాచ్‌కి రిఫరీ ఎవరు?’’ అని గవాస్కర్ ఘాటుగా ప్రశ్నించాడు.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబరులో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 152 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసింది. దాంతో.. 66 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా టీమ్ 99 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ముందు కేవలం 34 పరుగుల టార్గెట్ నిలవగా.. 8 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించేసింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిపోగా.. రిఫరీగా రిచీ రిచర్డ్‌సన్ ఉన్నాడు. ఈ పిచ్‌కి బిలో- యావరేజ్ రేటింగ్‌ని ఐసీసీ ఇచ్చింది. దాంతో ఒక డీమెరిట్ పాయింటే ఐసీసీ కేటాయించింది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news