Tuesday, March 21, 2023

Steve Smith | అప్పట్లో రహానె.. ఈరోజు స్టీవ్‌స్మిత్.. తాత్కాలిక కెప్టెన్స్ మ్యాజిక్!

Border–Gavaskar Trophy : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తాత్కాలిక కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (Steve Smith) మ్యాజిక్ చేశాడు. 2018లో బాల్ టాంపరింగ్ ఉదంతంతో అప్పట్లో ఏడాది నిషేధానికి గురైన స్టీవ్‌స్మిత్.. కెప్టెన్సీని కూడా చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కేవలం బ్యాటర్‌గానే జట్టులో కొనసాగిన స్టీవ్‌స్మిత్.. గత ఏడాది నుంచి మళ్లీ టీమ్ లీడర్‌షిప్ గ్రూప్‌లో కనిపిస్తున్నాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా ఈరోజు ముగిసిన మూడో టెస్టులో అనూహ్యంగా అతని చేతికి పగ్గాలు రాగా.. జట్టుని 9 వికెట్ల తేడాతో గెలిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టులో అతను మళ్లీ ఉత్సాహం నింపిన తీరు.. మ్యాచ్‌లో వ్యూహాలు, రివ్యూలని వినియోగించుకున్న విధానం ఆస్ట్రేలియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాయి. 2020-2021లో అజింక్య రహానె (Ajinkya Rahane) కూడా ఇలానే మ్యాజిక్ చేసి ఆస్ట్రేలియా జట్టుకి దాని సొంతగడ్డపైనే చుక్కలు చూపించాడు.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (2020-2021)లో ఆడేందుకు భారత్ జట్టు ఆస్ట్రేలియాకి వెళ్లింది. కానీ.. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనే టీమిండియా అవమానకరరీతిలో కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ జట్టు ఇక సిరీస్‌లో పుంజుకోవడం అసాధ్యమని మాజీలు తేల్చేశారు. దానికి తోడు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ టెస్టు మ్యాచ్ తర్వాత స్వదేశానికి వచ్చేశాడు. అనుష్క శర్మ ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. దాంతో అప్పట్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానె పగ్గాలు చేపట్టి.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ జట్టుని అద్భుతంగా నడిపించాడు. ఎంతలా అంటే? బ్రిస్బేన్‌లో 32 ఏళ్లుగా పరాజయం ఎరుగని ఆస్ట్రేలియాకి ఓటమి రుచి చూపించి.. సిరీస్‌లో భారత్‌ని 2-1తో విజేతగా నిలిపాడు.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (2023)లో ఆస్ట్రేలియా టీమ్ వరుసగా నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులో చిత్తుగా ఓడిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ రెండు టెస్టులనీ గెలుపుగా టీమిండియా ముగించేసింది. దాంతో సిరీస్‌లో ఆ జట్టు పుంజుకోవడం కష్టమని మాజీలు జోస్యం చెప్పారు. దానికి తోడు కెప్టెన్ పాట్ కమిన్స్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయాలతో ఆస్ట్రేలియాకి వెళ్లిపోయారు. మ్యాచ్‌లో ఆడిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 100 శాతం ఫిట్‌గా లేడు. ఇన్ని క్లిష్ట పరిస్థితుల నడుమ వైస్ కెప్టెన్‌గా ఉన్న స్టీవ్‌స్మిత్.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకి మళ్లీ విజయాన్ని అందించాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ టైమ్‌కి పాట్ కమిన్స్ భారత్‌కి రావడంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దాంతో స్మిత్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news