Friday, March 31, 2023

Shah Rukh Khan భార్య గౌరీఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

నాలుగేళ్ల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘పఠాన్’ (Pathaan) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపికా పదుకొనె (Deepika Padukone) ఫిమేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది. ఇక జనవరి 25న విడుదలైన ‘పఠాన్’.. వరల్డ్ వైడ్‌గా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూల్ చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఫుల్ హ్యాపీగా ఉన్న షారుఖ్ ఖాన్‌కు అంతలోనే షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆయన భార్య గౌరీ ఖాన్‌పై (Gauri Khan) తాజాగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. యూపీలో ఒక ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించి గౌరీఖాన్ న్యాయపరమైన చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియన్ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) కింద ఆమెపై కేసు నమోదు చేయబడింది.

గతంలో గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ తన నుంచి రూ.86 లక్షలు వసూలు చేసినప్పటికీ ఫ్లాట్‌ను అప్పగించడంలో విఫలమైందని జస్వంత్ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గౌరీఖాన్ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ప్రభావితమై తను సదరు ఫ్లాట్ కొనుగోలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు లక్నో, సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్‌ను ఇప్పుడు మరొక కొనుగోలుదారునికి కేటాయించారని అతను ఆరోపించాడు. ఈ సందర్భంగా తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్‌పై కూడా ఫిర్యాదుదారు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

ఇక షారుఖ్ వైఫ్‌కు ‘గౌరీ ఖాన్ డిజైన్స్’ పేరిట సొంతంగా ఓ సంస్థను నడుపుతోంది. బీ-టౌన్‌లో బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్లలో ఒకరిగా ఉన్న తను.. ప్రొఫెషన్‌లో భాగంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లను బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసింది. నిజానికి భర్త షారుఖ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటికీ, గౌరి తన ప్రొఫెషన్ ద్వారా సొంతంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే, షారుఖ్ ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. షారుఖ్ ఇటీవలే చెన్నైలో షూటింగ్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ మూవీ జూన్‌లో విడుదలయ్యే చాన్స్ ఉండగా.. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకీ’ పేరుతో మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు షారుఖ్. తాప్పీ పన్ను తదితరులు నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.

Latest news
Related news