వాస్తవానికి గత ఏడాది సెప్టెంబరు నుంచి భారత్ జట్టుకి బుమ్రా దూరంగానే ఉంటున్నాడు. గత మూడేళ్లుగా వెన్ను గాయం ఈ 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ని పదే పదే వేధిస్తోంది. అప్పట్లో హార్దిక్ పాండ్య తరహాలో సర్జరీ చేయించుకోమని వైద్యులు సలహా ఇచ్చినా .. ఈ ఫాస్ట్ బౌలర్ పట్టించుకోలేదు. సర్జరీ తర్వాత హార్దిక్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించి ప్రస్తుతం రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కానీ.. బుమ్రా మాత్రం గత మూడేళ్లలో రెగ్యులర్‌గా సిరీస్‌లు ఆడింది లేదు. దాంతో గాయానికి శాశ్వత పరిష్కారంగా సర్జరీ చేయించుకోవాలని ఈ పేసర్ నిర్ణయించుకున్నాడట.
మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఆ తర్వాత ఆసియా కప్.. ఆ వెంటనే వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఐపీఎల్, ఆసియా కప్ -2023కి దూరమవడం లాంఛనమే. కానీ.. అక్టోబరు – నవంబరులో జరిగే వరల్డ్‌కప్ టైమ్‌కి మాత్రం ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకి బుమ్రా ఆడుతున్న విషయం తెలిసిందే.