Thursday, March 30, 2023

Virat Kohli dance | రోహిత్ శర్మ సీరియస్‌గా చూస్తుంటే.. కామెడీగా గ్రౌండ్‌లో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ

IND vs AUS TEST : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. అప్పుడప్పుడు అంతే సరదాగా కనిపిస్తుంటాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎక్కువగా ఎమోషన్ అవుతూ కనిపించిన కోహ్లీ ఇప్పుడు మాత్రం రిలాక్స్‌గా గ్రౌండ్‌లో దర్శనమిస్తున్నాడు. అంతేకాదు.. ప్రేక్షకుల్ని బ్యాట్‌తోనే కాకుండా తన డ్యాన్స్‌తోనూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఇటీవల జరిగిన తొలి టెస్టులో షారూక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీలోని సాంగ్‌కి సరదాగా డ్యాన్స్ చేసిన కోహ్లీ.. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులోనూ స్టెప్‌లు వేస్తూ కనిపించాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. అది కూడా కేవలం 33.2 ఓవర్లలోనే టీమిండియా కుప్పకూలిపోయింది. 52 బంతులాడిన విరాట్ కోహ్లీ 2 ఫోర్లు కొట్టి 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ 12 పరుగుల వద్దే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత 108 పరుగుల వరకూ రెండో వికెట్ ఇవ్వలేదు. దాదాపు 32 ఓవర్లు వికెట్ పడకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లని పదే పదే మారుస్తూ.. ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేస్తూ కనిపించాడు. కానీ.. ఫలితం రాకపోవడంతో చాలా అసహనంతో కనిపించాడు.
రోహిత్ శర్మ అలా అసహనంగా చూస్తున్న సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అది కూడా పాట పాడుకుంటూ.. స్టెప్‌లు వేశాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ.. ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకోవాలంటే.. ఆస్ట్రేలియాని సిరీస్‌లో 3-1 లేదా 3-0తో భారత్ ఓడించాలి.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news