Sunday, April 2, 2023

Team India | ఇండోర్ టెస్టులో భారత్‌ బ్యాటర్లు విలవిల.. తిప్పేస్తున్న ఆస్ట్రేలియా స్పిన్నర్లు

India vs Australia 3rd Test : ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో భారత బ్యాటర్లు మొదటి రోజే అది కూడా తొలి సెషన్‌లోనే తడబడ్డారు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్‌, నాథన్ లయన్ దెబ్బకి భారత్ జట్టు 11.2 ఓవర్లు ముగిసే సమయానికే 45/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ ఉన్నారు.

వాస్తవానికి ఇన్నింగ్స్‌ని భారత ఓపెనర్లు శుభమన్ గిల్ (21: 18 బంతుల్లో 3×4), రోహిత్ శర్మ (12: 23 బంతుల్లో 3×4) చాలా దూకుడుగా ప్రారంభించారు. ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్‌పై ఎదురుదాడి చేస్తూ వరుస బౌండరీలు బాదారు. కానీ.. స్పిన్నర్ కునెమన్ ఎంట్రీ‌తో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. మ్యాచ్‌లో తాను వేసిన మొదటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ‌ని ఔట్ చేసిన ఈ యంగ్ స్పిన్నర్.. ఆ వెంటనే మరో ఓపెనర్ గిల్‌ని కూడా బోల్తా కొట్టించాడు. కునెమన్‌ విసిరిన బంతిని క్రీజు వెలుపలికి వెళ్లి హిట్ చేయబోయిన రోహిత్ శర్మ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. గిల్ స్లిప్‌లో స్టీవ్‌స్మిత్‌కి క్యాచ్ ఇచ్చాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (1: 4 బంతుల్లో)‌ని నాథన్ లయన్ బౌల్డ్ చేశాడు. బంతి పుజారా ఊహించిన దానికంటే ఎక్కువగా తిరిగి లోపలికి వచ్చి స్టంప్‌‌లని గీరాటేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (4: 9 బంతుల్లో) లయన్ బౌలింగ్‌లో సింపుల్‌గా కునెమన్‌‌కి క్యాచ్ ఇచ్చేశాడు. అనంతరం నెం.6లో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (0: 2 బంతుల్లో) కూడా డగౌట్‌గా వెనుదిరిగాడు.

ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం సహనంతో క్రీజులో నిలిచాడు. అతనికి విశాఖపట్నం కుర్రాడు కేఎస్ భరత్ సహకారం అందిస్తున్నాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Latest news
Related news