సుధీర్ బాబు హీరోగా రాబోతోన్న కొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యులాయిడ్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాలో దుర్గ అనే బండబాబు పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.
అయితే, సుధీర్ బాబు కొత్త లుక్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌లో సుధీర్ బాబు ఇప్పుడు కనిపించారు. ‘లడ్డూబాబు’ సినిమాలో నరేష్‌ను చూసినప్పుడు ఆడియన్స్ ఎంత ఆశ్చర్యపోయారో.. ఇప్పుడు సుధీర్ బాబు దుర్గ లుక్ చూసి అంతలా షాక్ అవుతున్నారు. అయితే, కొంత మంది ప్రేక్షకులు ఈ బండబాబు లుక్ అవసరమా అన్న అని ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన అభిమానులు మాత్రం లుక్ అదిరిపోయిందని.. సుధీర్ బాబు అంటే ప్రయోగాలకు పెట్టింది పేరని ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ‘మాయా మశ్చీంద్ర’ సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పుడు దుర్గ పాత్రను పరిచయం చేశారు. మిగిలిన రెండు పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు మార్చి 4న ఒకటి, 7వ తేదీన మరొకటి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.
కాగా, సుధీర్ బాబు ఇటీవల ‘హంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ సినిమా ‘ముంబై పోలీస్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో కండలు తిరిగిన శరీరంతో సుధీర్ బాబు కనిపించారు. అంతేకాదు, గే లక్షణాలు ఉన్న పాత్రలోనూ కనిపించి ఆశ్చర్యపరిచారు.