Sunday, April 2, 2023

Ravindra Jadeja అరుదైన ఘనత.. కపిల్‌దేవ్ సరసన రికార్డ్‌లో చోటు

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా ఈరోజు ప్రారంభమైన మూడో టెస్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9: 6 బంతుల్లో 1×4) వికెట్ పడగొట్టిన రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5000 వేల పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌లో దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ మాత్రమే ఉండగా.. తాజాగా అతని సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు.

గాయం కారణంగా దాదాపు ఐదు నెలలు క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియాతో తాజాగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఆడిన తొలి రెండు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు పడగొట్టిన జడేజా.. ఇండోర్‌ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్‌ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసిన జడేజా.. మార్కస్ లబుషేన్ (31: 91 బంతుల్లో 1×4)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మార్కస్ లబుషేన్‌ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా నెం.1 ఆల్‌రౌండర్‌గా లిస్ట్‌లో ఉన్నాడు. అయితే.. తాజాగా జరుగుతున్న సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లకిగానూ నాలుగు సార్లు లబుషేన్‌ని జడేజా ఔట్ చేయడం గమనార్హం. జడేజా విసిరే స్ట్రయిట్ డెలివరీ టర్న్ అవుతోందని భ్రమపడుతూ ప్రతిసారీ లబుషేన్ బోల్తా కొట్టేస్తున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news