టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 435/8 వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ 224 బంతుల్లో 153 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 176 బంతుల్లోనే 186 రన్స్ చేశాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 209 పరుగులకే కుప్పకూలింది. కానీ కెప్టెన్ టిమ్ సౌథీ 49 బంతుల్లోనే 73 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు అసలైన బజ్ బాల్ దెబ్బను రూచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించింది. ఈ నిర్ణయమే పర్యాటక జట్టును దెబ్బతీసింది.
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం న్యూజిలాండ్ అసాధారణ రీతిలో పోరాడింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (83), కాన్వే (61) తొలి వికెట్‌కు 149 పరుగులు జోడించారు. కేన్ విలియమ్సన్ (132) సెంచరీకి.. డారెల్ మిచెల్ (54), టామ్ బ్లండెల్ (90) సహకారం తోడవటంతో న్యూజిలాండ్ 483 రన్స్‌కు ఆలౌటయ్యింది. ప్రత్యర్థి ముందు 258 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
లక్ష్య చేధనను ఇంగ్లాండ్ దూకుడుగా ఆరంభించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చివరి రోజు 210 పరుగులు చేస్తే చాలు ఇంగ్లాండ్‌దే విజయం.
న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్ చేసిన హ్యారీ బ్రూక్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 80 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (116 బంతుల్లో 33), జో రూట్ (113 బంతుల్లో 95) ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. కానీ వరుస ఓవర్లలో వీరిద్దర్నీ ఔట్ చేసిన నీల్ వాగ్నర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 57 బంతుల్లో 35 రన్స్ చేసిన బెన్ ఫోక్స్‌ను సౌథీ పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లాండ్ 251 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
కానీ జాక్ లీచ్ (31 బంతుల్లో 1 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (6 బంతుల్లో 4) తమ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. మరో రెండు పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుందనగా.. వాగ్నర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చిన అండర్సన్ ఔటయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్ సంబరాలు చేసుకుంది. ఫాలోఆన్ ఆడుతున్న సమయంలో సెంచరీ చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేందుకు దోహదం చేసిన కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్‌గా ఎంపికయ్యాడు.
1993లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో టెస్టు మ్యాచ్ గెలవగా.. మళ్లీ ఇన్నాళ్లకు న్యూజిలాండ్ ఆ ఫీట్ రిపీట్ చేసింది. ఫాలోఆన్ ఆడుతున్న జట్టు టెస్టు మ్యాచ్ గెలుపొందడం ఇది నాలుగోసారి మాత్రమే. 1894, 1981ల్లో ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించగా.. 2001లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ఫాలోఆన్ ఆడుతూ.. ఆస్ట్రేలియాపై గెలిచి చరిత్ర సృష్టించింది.