Friday, March 24, 2023

YS Jagan: ‘సార్’ సినిమా చూస్తుంటే వైఎస్ జగన్ గుర్తొచ్చారు.. సీఎం ‘సార్’పై ప్రశంసలు

పిల్లల్ని చదివించాలనే ప్రతి తల్లిదండ్రుల కల. చదువుకోవాలని అందరికీ ఉన్నా చదువుకొనే పరిస్థితులు వచ్చేయడంతో విద్య వ్యాపారంగా మారిపోయింది. అందరూ చదువుకోవాలి.. చదువుకొనకూడదని చెప్తూ.. కార్పొరేట్ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై ఎక్కుపెట్టిన బాణంలా వచ్చిన చిత్రం ‘సార్’ (Sir Movie). తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17 విడుదలై ఘన విజయాన్ని సాధించింది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి (venky atluri) చక్కని సందేశాత్మక చిత్రంతో ఆలోచింపచేసేలా ‘సార్’ చిత్రాన్ని అద్బుతంగా మలిచారు. కాగా ఈ చిత్రాన్ని చూసిన సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్ సినిమా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తొచ్చారంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తాజా వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘సార్’ సినిమా చూశాను.. చాలా అద్భుతంగా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై ఎన్నోఏళ్లుగా విమర్శలు ఉన్నా.. అది కంటిన్యూ అవుతూనే ఉంది. విద్యార్దుల్ని దోచుకుంటూనే ఉన్నారు. పేరెంట్స్ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఉద్దేశంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ ఉచ్చులో పడి.. గవర్నమెంట్ కాలేజ్‌లు దూరం పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్‌లు ఉన్నా.. వాటిని పట్టించుకోవడం లేదు. చాలావరకూ నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ పాయింట్‌పై సార్ సినిమా తీశారు. పనికి రాదనుకున్న స్కూల్‌ని పైకి తీసుకుని వచ్చాడు హీరో. అతనికి హ్యాట్సాఫ్.

నా లెక్కలో ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోలు. ధనుష్ ఒకరైతే.. దర్శకుడు, నిర్మాత కూడా హీరోలే. ఇలాంటి సామాజిక సమస్యపై సినిమా తీయడానికి నిర్మాతకి చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి కథని ఎంచుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి అభినందనలు. ఇక ధనుష్ అయితే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటారు. మన తెలుగు హీరోలైతే ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు రారు. నిజానికి తెలుగులో చాలామందికి ఈ కథ చెప్పే ఉంటారు. వాళ్లు చేయకపోవడతోనే తమిళ్ హీరోల దగ్గరకు వెళ్లి ఉంటాడు.

మొత్తానికి ఎలాగైతే సినిమా హిట్ అయ్యింది.. తెలుగు, తమిళంలో ప్రేక్షకులు ఆదరించారు. ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు చూడొచ్చనే ధైర్యం ఇచ్చారు. రీసెంట్‌గా నేను జేడీ లక్ష్మీనారాయణ వీడియో చూశాను.. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్ స్కూల్స్‌ని విజిట్ చేస్తూ.. నాడు నేడు అంటూ స్కూల్స్‌ని బాగా డెవలప్ చేస్తున్నారు.. ఇలా చేస్తే బాగుంటుంది.. అమ్మఒడి లాంటి పథకాలతో డబ్బు వేస్ట్ అవుతుందని కూడా అన్నారు. అలాంటి పెద్దవాళ్లు బాగుందని చెప్పినప్పుడు.. అలాంటి వాళ్ల సలహాలు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్ బాగుండాలి. సీఎం జగన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై దృష్టిపెట్టి కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు.. అవన్నీ సక్సెస్ అయితే.. ‘సార్’ సినిమా హిట్ అయినట్టే జగన్ గారి పార్టీ కూడా హిట్ అవుతుంది. జగన్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం టాక్స్‌లు కట్టేదే పిల్లల చదువుకోసం.. వారి భవిష్యత్ కోసం. విద్య వైద్యంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి’ అని అటు సార్ చిత్ర యూనిట్‌పైన ఇటు సీఎం జగన్‌పైన ప్రశంసలు కురిపించారు తమ్మారెడ్డి.

tammareddy bharadwaj

తమ్మారెడ్డి

Latest news
Related news