సికింద్రాబాద్ నుంచి పుణె మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు స్థానంలో వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ (Indian Railways) చర్యలు చేపట్టింది. నెల రోజుల్లో ఏప్రిల్ నుంచి కొత్త రేక్స్‌తో సికింద్రాబాద్- పుణె మార్గంలో కొత్త వందే భారత్ రైలు పలుగులు పెట్టనుంది. ఇప్పటికే భారతీయ రైల్వేస్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త రైలు త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఈ కొత్త వందే భారత్ రైలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి సికింద్రాబాద్ డివిజన్ కిందకు వస్తుందని రైల్వే అధికారి ఒకరు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో తెలిపారు. శతాబ్ది రైళ్లను (shatabdi express) వందే భారత్‌తో రీప్లేస్ చేసే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మహారాష్ట్ర పరిధిలో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి సోలాపూర్, షిరిడీ వైపు ఇవి నడుస్తున్నాయి. వీటికి మంచి స్పందన వస్తోంది. ఇక హౌరా నుంచి పుణె మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రేక్స్‌తో భర్తీ చేసే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ. మరోవైపు.. సికింద్రాబాద్ నుంచి మూడు రూట్లలో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె రూట్లను రైల్వే శాఖ పరిశీలిస్తోందని సమాచారం. వచ్చే ఏప్రిల్‌లో సికింద్రాబాద్- పుణె మధ్య కొత్త రైలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోని పలు రూట్లలో 10 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దిల్లీ-వారణాసి, దిల్లీ-కాట్రా, గాంధీనగర్-ముంబాయి సెంట్రల్, దిల్లీ- అంబ్ అందౌర, బిలాస్‌పూర్- నాగ్‌పూర్, చెన్నై-మైసూరు, హౌరా-న్యూజల్పైగురి జంక్షన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, ముంబాయి-షిరిడీ, ముంబాయి సోలాపూర్ రూట్లలో వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. కొత్త రైళ్లకు ప్రయాణికల నుంచి మంచి స్పందన వస్తోంది. ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.
- Read Latest Business News and Telugu News