విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి.. దివ్యాంగులకి రిజర్వేషన్ల వారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులని ప్రభుత్వం చెల్లించాలి. కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టాన్ని ఇలాగే అమలు చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వందశాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ఏటా రూ. 13 వేలు అందిస్తోంది. ఈ సాయం అందిన తర్వాత 60 రోజుల్లోపు తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోతే తదుపరి సంవత్సరం ఆ మొత్తాన్ని మినహాయించి.. పాఠశాలకు చెల్లిస్తారు. గతేడాది ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఏడాది ఇచ్చే అమ్మఒడి నుంచే ఫీజు చెల్లించాలి. అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి.. గతేడాది విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు. ఇప్పుడు తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపైనే ఆ భారం పడింది.
BREAKING NEWS