PARDAFASH rallies: దేశవ్యాప్త ర్యాలీలు
ఆదానీ (Goutham Adani), ప్రధాని మోదీ (PM Modi), బీజేపీల మోసపూరిత సాన్నిహిత్యం దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆదానీ, హిండెన్ బర్గ్ వ్యవహారంపై మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘PARDAFASH’ ర్యాలీలను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయన్నారు. నిరసనల్లో భాగంగా మార్చి 6 నుంచి మార్చి 10 మధ్య జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు ప్రెస్ మీట్స్ నిర్వహిస్తారని, తాలుకా స్థాయిలో బ్యాంకులు, ఎల్ఐసీ (LIC) ఆఫీసుల ముందు కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తారని వేణుగోపాల్ వివరించారు. అలాగే, మార్చి 13న రాష్ట్రాల రాజధానుల్లో భారీ ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ ఉంటుందని వివరించారు. పార్టీ సీనియర్ నేతలు, పార్టీకి చెందిన అన్ని విభాగాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో పాల్గొంటారని తెలిపారు.