Friday, March 24, 2023

Rohit Sharma | కెప్టెన్‌గా అరుదైన రికార్డ్ ముంగిట రోహిత్ శర్మ.. అప్పట్లో ధోనీ, కోహ్లీకి నిరాశ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డ్ ముంగిట ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తలపడుతుండగా.. ఇప్పటికే ముగిసిన తొలి రెండు టెస్టుల్లోనూ భారత్ గెలిచింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభంకానుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతున్న ఈ మ్యాచ్‌లో కూడా భారత్ జట్టు గెలిస్తే? కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరనుంది.

గత ఏడాది భారత టెస్టు జట్టు పగ్గాల్ని విరాట్ కోహ్లీ నుంచి అందుకున్న రోహిత్ శర్మ.. ఇప్పటి వరకూ నాలుగు టెస్టుల్లో టీమిండియాని నడిపించాడు. ఈ నాలుగు టెస్టుల్లోనూ భారత్ జట్టు విజయం సాధించింది. ఇండోర్ టెస్టు మ్యాచ్ ఐదోదికాగా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి ఐదు టెస్టుల్లో విజయాల్ని అందుకున్న తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీకి ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. మరి రోహిత్ శర్మ సాధిస్తాడేమో చూడాలి.

నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ దెబ్బకి ఆస్ట్రేలియా బ్యాటర్లు విలవిలలాడిపోయారు. ఇండోర్ పిచ్ కూడా స్పిన్‌కి అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియానే గెలుస్తుందని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news