Friday, March 31, 2023

Kangana Ranaut: స్టార్ హీరో గాలి తీసేసిన కంగనా రనౌత్.. యాక్టింగ్‌పై దారుణంగా కామెంట్స్

Bollywood News: బీటౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). విజయాలతో పాటు వివాదాలు కూడా ఆమెకు అలవాటే. అయితే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న కంగన.. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలకు, తిరస్కారాలకు గురైనా వెరవలేదు. ఒక దశలో ఇండస్ట్రీలోని టాప్ హీరోలతోనూ వైరం పెట్టుకుంది. హృతిక్ రోషన్‌తో రిలేషన్‌షిప్, అతడు చేసిన మోసం గురించిన వివరాలను పబ్లిక్‌గా బయటపెట్టి షాక్ ఇచ్చింది. మొత్తానికి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంగన.. ప్రస్తుతం తమిళ్‌లో ‘చంద్రముఖి2’ (Chandramukhi2) చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగానే షూటింగ్ బ్రేక్‌లో ఫ్యాన్స్‌తో #askkangana పేరుతో జరిపిన చిట్ చాట్‌లో ఇద్దరు స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఆన్సర్ ఆశ్చర్యపరిచింది.

‘హృతిక్ రోషన్ (Hritik Roshan), దిల్జీత్ దోసాంజ్ (Diljeet Dosanjh)’.. ఇద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని? ఓ అభిమాని కంగనను అడిగాడు. ఈ ప్రశ్నకు బదులిచ్చిన కంగన.. ‘నాకు తెలిసి ఒకరు యాక్షన్ చేస్తారు, మరొకరు పాటల వీడియోలు చేస్తారు. నిజాయితీగా చెప్తు్న్నా.. వాళ్లు నటించడాన్ని ఎప్పుడూ చూడలేదు. ఏదైన ఒకరోజు వాళ్లు నిజంగా నటించడం చూస్తేనే చెప్పగలను. అలాంటిది జరిగితే నాకు తెలియజేయండి. థాంక్స్’ అంటూ ముగించింది.

అయితే, ఇక్కడ హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్‌‌కు యాక్టింగ్ చేయడం రాదని చెప్పడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హృతిక్‌కు యాక్టింగ్ రాకుంటే.. ‘గుజారిష్, సూపర్ 30, కోయి మిల్ గయా’ చిత్రాల్లో హృతిక్ చేసిందాన్ని ఏమంటారు? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. నీ కంటే బెటర్ యాక్టర్ అంటూ కంగన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కంగన, హృతిక్ మధ్య 2016-2017 టైమ్‌లో ఒక పెద్ద లీగల్ వార్ నడిచిన విషయం తెలిసిందే. హృతిక్, తాను డేటింగ్ చేసినట్లు ఆమె మీడియాకు వెల్లడించగా.. హృతిక్ ప్రతిసారి ఈ విషయాన్ని ఖండిస్తూ వచ్చాడు.

కంగనా ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘చంద్రముఖి 2’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటోంది. గతంలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘చంద్రముఖి’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో కంగన అందంతో పాటు నృత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ఒక రాజు ఆస్థానంలో నర్తకి పాత్రను పోషిస్తోంది. కాగా ఈ చిత్రంలో కంగన సరసన తమిళ నటుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పీరియాడికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోంది.

Latest news
Related news