Thursday, March 30, 2023

Yoga For liver Health: ఈ ఆసనాలు వేస్తే.. లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది..!

Yoga For liver Health: లివర్‌ మన శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో ఒకటి. ఇది మన బాడీలో అతి పెద్ద అవయవం కూడా. కాలేయం మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివర్ సరిగ్గా బాగా పని చేయాలి. కార్బోహైడ్రేట్లను, కొవ్వులు, ప్రోటీన్లను విడగొట్టటం.. జీర్ణక్రియకు తోడ్పడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం లివర్‌ పని. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్‌ నియంత్రిస్తుంది. శక్తిని నిల్వ చేస్తుంది, హార్మోన్లను, ప్రోటీన్‌లను రెగ్యులేట్ చేస్తుంది. చెడు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని కారణంగా.. అనేక ప్రమాదకరమైన వ్యాధులు చుట్టుముడతాయి. లివర్‌‌ బలహీనపడితే.. క్యాన్సర్‌, సిర్రోసిస్‌, ఫ్యాటీలివర్‌, హెపటైటిస్ A, B, C వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ సోడా, ఆల్కహాల్‌, జంక్ ఫుడ్స్‌, కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని యోగాసనాలు సహాయపడతాయి. అవేంటే తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ధనురాసనం..

ధనురాసనం..

ధనురాసనం ప్రాక్టిస్‌ చేయడం వల్ల లివర్‌ స్ట్రెచ్‌ అవుతుంది, యాక్టివ్‌గా ఉంటుంది. ధనురాసనం క్రమం తప్పకుండా చేస్తే.. లివర్‌ క్రమం బలపడుతుంది. ఫ్యాటీ లివర్‌‌‌‌ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది.

ఎలా చేయాలి..?

ధనురాసంలో మన శరీరం విల్లు ఆకారంలో ఉంటుంది. బోర్ల పడుకుని తలను కొంచె పైకి ఎత్తాలి. వెనుక నుంచి మోకాళ్లను చేతులతో వంచి విల్లు లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. శ్వాసను సాధారణంగా ఉంచాలి. కొంచెం సేపు ఈ స్థితిలోనే ఉండాలి. మెల్లగా యాదాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.

భుజంగాసనం..

భుజంగాసనం..

భుజంగాసనం కాలేయాన్ని యాక్టివ్‌ చేయడానికి సహాయపడుతుంది. ఇది చాలా సులభమైన యోగాసనం, దీనిని కోబ్రా పోజ్‌ అని కూడా అంటారు. రోజూ 5 నిమిషాల పాటు భుజంగాసనం చేస్తే.. లివర్‌ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్‌ రిస్క్‌ తగ్గుతుంది.

ఆసనం ఎలా వేయాలి..?

ఈ ఆసనం వేయడానికి ముందుగా.. బోర్లా పడుకొని శరీరం స్ట్రెచ్‌ చేయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆని ఉండేలా చూసుకోవాలి. కొంచెం సేపు తర్వాత శ్వాసను వదులుతూ.. తిరిగి సాధారణ స్థితికి రావాలి.

పర్వతాసనం

పర్వతాసనం

పర్వతాసనం రోజూ ప్రాక్టిస్‌ చేస్తే.. లివర్‌ ఇన్ఫ్లమేషన్‌ తగ్గుతుంది. పిత్త రసం ఉత్పత్తి పెరుగుతుంది. హైపటైటిస్‌ ముప్పు తగ్గుతుంది.

ఎలా చేయాలి..?

ముందుగా నిలబడి మెల్లగా శ్వాస వదులుతూ రెండు చేతులూ రెండు పాదాల పక్కన పెట్టాలి. ముందు కుడికాలును, తర్వాత ఎడమకాలును వెనక్కి జరపాలి. పాదాలు పూర్తిగా కింద ఆనించాలి. తల, భుజాలు మోకాళ్ల వైపు వెళ్లాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా మోకాళ్లను కింద పెట్టేసి కూర్చున్న స్థితిలో రెస్ట్‌ తీసుకోవాలి.

అనులోమ్ -విలోమ్..

అనులోమ్ -విలోమ్..

అనులోమ్‌ విలోమ్ ప్రాణాయామం శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీని కారణంగా, లివర్‌కు తగినంత పోషకాహారం, ఆక్సిజన్ అందుతుంది. దాని పనితీరు మెరుగుపడుతుంది.
సుఖాసనంలో కూర్చుని, కళ్లు మూసుకొని ముక్కు కుడి రంధ్రాన్ని కుడి బొటనవేలితో మూయాలి. ఎడమ రంధ్రంతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు మధ్యవేలితో ముక్కు ఎడమ రంధ్రాన్ని మూసి, కుడి రంధ్రంతో శ్వాస వదలాలి. అదే రంధ్రంతో శ్వాస తీసుకొని.. కుడి బొటన వేలితో కుడి రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంతో శ్వాస వదలాలి. తర్వాత వేరే వైపు నుంచి చేయాలి. కుడి రంధ్రంతో శ్వాస తీసుకొని, ఎడమ రంధ్రంతో వదలాలి. అదే రంధ్రంతో శ్వాస తీసుకొని, కుడి రంధ్రంతో వదలాలి.

కపాలభాతి..

కపాలభాతి..

రోజూ కపాలభాతి చేస్తే.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. లివర్‌ను బలంగా ఉంచుతుంది.

కపాలభాతి చేయడానికి ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. మీ పోజ్‌ నిటారుగా ఉండాలి. మీ అర చేతులను.. మోకాలపై పెట్టి కళ్లు మూసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఊపరి పీల్చుకుంటూ, వదలాలి. గాలి పీల్చుకొని, గాలి వదిలే సమయంలో పొట్టను ఒక జెర్క్‌తో లోపలికి లాగాలి. ముందుగా 20, 30 సార్లు చేయడం మొదలు పెట్టి నెమ్మదిగా 100 నుంచి 200 వరకు చేయాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

Latest news
Related news