వ్యయ నియంత్రణ పేరుతో ఎరిక్సన్ (Ericsson) ఉద్యోగాల తొలగింపు చర్యలు చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లేఆఫ్స్‌లో భాగంగా ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు కంపెనీ మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోతున్న వారి సంఖ్య దేశాన్ని బట్టి మారుతుంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) బోర్జే ఎకోల్మ్ తెలిపారు. ఏయే దేశాల్లో ఎంత మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నామనే వివరాలను ఇప్పటికే కొన్ని దేశాలకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
ఖర్చులు తగ్గించునే చర్యల్లో భాగంగా టెలికాం పరికరాల తయారీ కంపెనీ ఎరిక్సన్ ఇటీవలే స్వీడన్‌లో 1,400 మంది ఉద్యోగులను తొలగించింది. ఆయా తొలగింపులకు తాజా ప్రకటన అదనంగా తెలుస్తోంది. అప్పటి లేఆఫ్స్‌తో కలుపుకొని దాదాపు 10 వేల మందిని ఎరిక్సన్ ఉద్యోగాల్లోంచి తీసేసినట్లు స్పష్టమవుతోంది. భారత్‌లోనూ ఎరిక్సన్ కంపెనీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగులపైనా లేఆఫ్స్ ప్రభావం ఉండనుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ఎరిక్సన్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 1,05,000 మంది ఉద్యగులు పని చేస్తున్నారు. అయితే, తాజా లేఆఫ్స్ వల్ల ఏ దేశంలోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారనే అంశాన్ని ఎరిక్సన్ వెల్లడించలేదు. కానీ, ఉత్తర అమెరికాలోని దేశాల్లో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వృద్ధిపతంలో ఉన్న భారత్ వంటి దేశాల్లో ఈ ఉద్యోగాల కోతలు తక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 2023 చివరి నాటికి 9 బిలియన్ క్రౌన్స్ (880 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు తగ్గించుకుంటామని గత ఏడాది డిసెంబర్, 2022లోనే ప్రకటించింది ఎరిక్సన్ సంస్థ. అందులో భాగంగానే 10 వేల మందికిపైగా ఉద్వాసన పలికినట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులోనూ మరిన్ని కోతలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.