స్టాండర్డ్ డిడక్షన్..
సగటు వేతన జీవులు సాలరీ ద్వారానే ఆదయం పొందుతున్న వ్యక్తు, పింఛన్ పొందుతున్న వారు ఈ కొత్త విధానంలోనూ రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) పొందేందుకు వీలుంది. ఉద్యోగులు జీతం ద్వారా వచ్చే రాబడిపై, పెన్షనర్లు పింఛన్ ఆదాయంపై ఈ మినహాయింపులకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతన జీవులు వారు పని చేసే సంస్థలు ట్యాక్స్ లెక్కగట్టేటప్పుడు ప్రామాణిక తగ్గింపును ఆటోమేటిగ్‌గా పరిగణనలోకి తీసుకుంటాయి. కావున ఈ తగ్గింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
అగ్నివీర్‌లకు మినహాయింపులు..
అగ్నిపథ్ స్కీమ్ 2022 కిందకు వచ్చే వ్యక్తులు అగ్నివీరి కార్పస్ ఫండ్‌లో జమ చేసిన సొమ్ముపై సెక్షన్ 10 (12సీ) కింద మినహాయింపును పొందుతారు. దీని కోసం సెక్షన్ 80సీసీహెచ్ ప్రతిపాదించింది ఆర్థిక శాఖ. అగ్నిపథ్ పథకంలో 2022 నవంబర్ 1 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారు ఈ తగ్గింపు పొందే అర్హత ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ప్రకారం.. అగ్ని వీర్ కార్పస్ ఫండ్‌కు చేసిన విరాళాలకు సమానంగా తగ్గింపును అందుకోవచ్చు. ఈ మినహాయింపు పాత, కొత్త పన్ను విధానాలు రెండింటిలోనూ ఉంటుంది. అగ్నిపథ్ పథకం కార్పస్ ఫండ్ ఖాతాకు కేంద్ర అందించిన సహకారాన్ని జీతంగా పరిగణిస్తారు. సెక్షన్ 80సీసీహెచ్ కింద దానికి సంబంధించిన మినహాయింపును అనుమతిస్తారు.
ఎన్‌పీఎస్ సెక్షన్ 80సీసీడీ (2)..
ఉద్యోగులు జాతీయ పింఛను స్కీమ్ (ఎన్‌పీఎస్) ఖాతాకు సంస్థ యజమాని అందించే సహకారంపై కొత్త ట్యాక్స్ విధానంలో మినహాయింపు అందుకోవచ్చు. ఈ మినహాయింపు సెక్షన్ 80సీసీడీ(2) కిందకు వస్తుంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు జీతంలో గరిష్ఠంగా 10 శాతం సమానమైన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగులకు 14 శాతం వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. ఇది గరిష్ఠ పరిమితి రూ.7.50లక్షలుగా ఉంది.
అద్దె ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్..
అద్దె అదాయం వస్తున్న సందర్భంలో వార్షిక విలువపై ఇంటి యజమాని 30 శాతం వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఒక ఆర్థిక ఏడాదిలో వచ్చే మొత్తం అద్దె ఆదాయం నుంచి చెల్లించిన మున్సిపల్ పన్నులు తీసివేసి వార్షిక విలువను లెక్కిస్తారు.