Friday, March 24, 2023

IND vs AUS Semi Final | సెమీస్‌లో భారత్ ఓటమి తర్వాత కూలింగ్ గ్లాస్‌లతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. ఎమోషనల్ రీజన్

ICC Womens T20 World Cup 2023 : ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2023లో భారత్ జట్టు ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి పరాజయాన్ని చవిచూసింది. ఆస్ట్రేలియా జట్టుతో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు చివరికి 5 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఛేదనలో దూకుడుగా ఆడి భారత్ జట్టుని గెలిపించేలా కనిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52: 34 బంతుల్లో 6×4, 1×6) దురదృష్టవశాత్తు ఆఖర్లో రనౌట్‌గా వెనుదిరిగింది. మ్యాచ్‌లో ఆ రనౌట్ కీలక మలుపుకాగా.. అక్కడి నుంచి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయింది.

వాస్తవానికి ఈ సెమీస్ మ్యాచ్‌కి ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర జ్వరంతో బాధపడింది. దాంతో మ్యాచ్‌లో ఆడటం కూడా డౌట్‌గానే కనిపించింది. కానీ.. సాహసోపేతంగా ఆమె మ్యాచ్ ఆడింది. మైదానంలో ఉత్సాహంగా కనిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. బ్యాటింగ్‌లోనూ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడింది. కానీ.. భారత్ విజయానికి ఆఖర్లో 33 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో పరుగు తీసే క్రమంలో క్రీజు వెలపల బ్యాట్ స్ట్రక్ అవడంతో రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో కన్నీళ్లతోనే పెవిలియన్‌కి వెళ్లిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఆ తర్వాత అవార్డ్ ప్రజెంటేషన్ సమయంలోనూ ఏడుస్తూనే కనిపించింది.

మ్యాచ్ గురించి మాట్లాడాలని అవార్డ్స్ ప్రజెంటేషన్ సమయంలో వ్యాఖ్యాత కోరగా.. కన్నీళ్లని దాచే ప్రయత్నంలో కూలింగ్ గ్లాస్ వేసుకుని హర్మన్‌ప్రీత్ కౌర్ వచ్చింది. అయితే ఆమె కన్నీళ్లని పసిగట్టిన వ్యాఖ్యాత ఎందుకు ఏడుస్తున్నారు..? అని ప్రశ్నించారు. దాంతో హర్మన్‌ప్రీత్ మరింత ఎమోషనల్ అయిపోయింది. ‘‘నా ఏడుపుని నా దేశం చూడాలని నేను అనుకోవడం లేదు. అందుకే ఈ కూలింగ్ గ్లాస్‌లు వేసుకుని వచ్చా. మరోసారి దేశం ఇలా ఓడిపోయేలా చేయమని ప్రామిస్ చేస్తున్నా. మా ఆటని మెరుగు పర్చుకుంటాం. నిజానికి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం. కానీ నేను రనౌటయ్యా.. ఇంతకంటే బ్యాడ్‌లక్ ఉండదేమో ’’ అని హర్మన్‌ప్రీత్ ఎమోషనల్ అయిపోయింది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news