Thursday, March 30, 2023

Harmanpreet Kaur Runout: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్.. సెమీస్‌లో భారత్‌ను వెంటాడిన దురదృష్టం

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్‌ను దురదృష్టం వెంటాడింది. 173 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ.. జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా పోరాడారు. జెమీమా ఔటైనప్పటికీ హర్మన్ దుమ్మురేపే ఆటతీరు కనబర్చింది. దీంతో భారత్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అనారోగ్యంతోనే బరిలోకి దిగిన హర్మన్.. కొదమ సింహంలా పోరాడింది. కానీ కీలక సమయంలో కెప్టెన్ రనౌట్ కావడం భారత్‌కు విజయాన్ని దూరం చేసింది.

జెమీమా ఔటయ్యాక జట్టును గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న హర్మన్..15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ అదే ఓవర్లో అనూహ్య రీతిలో రనౌటయ్యింది. డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడిన హర్మన్.. ఈజీగా రెండు పరుగులు తీయొచ్చనే ఉద్దేశంతో కాస్త మెల్లగా పరుగు తీసింది. బ్యాట్‌ను క్రీజ్‌లో ఉంచబోతుండగా.. క్రీజ్‌కు కొద్ది ముందు బ్యాట్ అనూహ్యరీతిలో స్ట్రక్ అయ్యింది. ఆమె పాదాన్ని క్రీజ్‌లోపల మోపేలోపే.. వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసింది. దీంతో హర్మన్ రనౌటయ్యింది. అనవసరంగా వికెట్ పారేసుకున్న బాధలో హర్మన్ బ్యాట్‌ను నేలకేసి కొట్టింది. డగౌట్‌లోకి వెళ్లాక కన్నీటి పర్యంతమైంది. హర్మన్ ఔట్ కాకపోయి ఉండుంటే.. మ్యాచ్ ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది.

2019 పురుషుల వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లోనూ భారత్ ఇలాగే ఓటమిపాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో మార్టిన్ గుప్టిల్ డైరెక్ట్ త్రో ద్వారా ధోనీ (72 బంతుల్లో 50)ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ కివీస్ వైపు మొగ్గింది. ధోనీ రనౌట్‌తో స్టేడియం మూగబోగా.. భారత అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

అప్పుడు భారత జట్టుకు కెప్టెన్ ధోనీ కాగా.. అతడి జెర్సీ నంబర్ 7. ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో రనౌట్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియాకు కెప్టెన్, ఆమె జెర్సీ నంబర్ కూడా ఏడు కావడం గమనార్హం. రెండు వరల్డ్ కప్‌ల్లోనూ కెప్టెన్ల రనౌట్ భారత్‌‌ ఓటమి దారి తీయడం దురదృష్టకరం.

గత ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్లో నిష్క్రమించింది. భారత్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. సెమీస్‌లో తన కంటే బలమైన ఆస్ట్రేలియాపై వీరోచితంగా పోరాడినప్పటికీ.. ఓటమి తప్పలేదు.

Latest news
Related news