apple gifts to employees, కంపెనీలో పదేళ్లు.. ఉద్యోగులకు Apple ఊహించని Gifts.. నెటిజన్ల తిట్ల దండకం! – apple gives employees this gift on their 10 year anniversary, mixed reactions from netizens
Apple: ఐఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ యాపిల్ నిర్ణయంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చాలా కంపెనీలు ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటివి ఇందులో ఉన్నాయి. అయితే.. ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన, ఆదాయంలో అగ్రభాగాన ఉన్న యాపిల్.. ఉద్యోగులను ఉత్తేజపరుస్తోంది. ఇదే క్రమంలో తమ కంపెనీలో 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు జ్ఞాపకార్థంగా ఊహించని బహుమతులు ఇస్తోంది. నగదు బహుమతులో, కార్లో, బైక్సో అనుకోవద్దు. ఐఫోన్ల తయారీ కంపెనీ కదా అని ఐఫోన్లు ఇస్తుందని కూడా అనుకోవద్దు.
అల్యూమినియంతో తయారు చేసిన ఒక స్మారక చిహ్నం, యాపిల్ పాలిషింగ్ క్లాత్, ఆ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతూ.. స్వయంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంతకంతో కూడిన ప్రశంసా పత్రం అందులో ఉంది. ఒక ఉద్యోగికి ఈ బహుమతి అందగా దానిని DongleBookPro అనే ఒక ఇంటర్నెట్ యూజర్ ఆ గిఫ్ట్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే క్రమంలో అత్యంత అరుదైన యాపిల్ ఉత్పత్తుల్లో ఇది ఒకటి కావొచ్చని, అది ఒకటి సాధించాలంటే కంపెనీలో పదేళ్లు కష్టపడాలని ఆ యూట్యూబర్ చెప్పుకొచ్చాడు. అయితే యాపిల్ తమ ఉద్యోగులకు ఇచ్చే గిఫ్ట్స్‌లో మరో 3 వెర్షన్స్ ఉన్నాయని.. 20 ఏళ్లు పనిచేస్తే.. స్పేస్ గ్రే అల్యూమినియం, 30 సంవత్సరాలు పనిచేస్తే సిల్వర్ స్టెయిన్‌లెస్ స్టీల్, 40 సంవత్సరాలకు స్పేస్ గ్రే స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తుందని ఒక యూజర్ కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చారు.
ఇక ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ చూడాలి. చాలా మంది యాపిల్ కంపెనీపై తిట్ల దండకం అందుకున్నారు. పదేళ్లు కష్టపడి పనిచేస్తే ఇచ్చే విలువ ఇదేనా అంటూ విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో.. ఆ గిఫ్ట్ కార్డ్‌ను చూసి మురిసిపోండి అంటున్నారు. పదేళ్లు చేస్తే.. ఒక మెటల్‌తో సరిపెట్టుకుందని ఇంకొకరు అన్నారు. ‘పదేళ్లు పనిచేసినవారికి యాపిల్.. ఒక స్మారక చిహ్నం ఇచ్చింది. గ్రేట్ జాబ్ యాపిల్..’ అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. అసలు ఆ మెటల్ దేనికీ పనికిరాని ఒక చెత్త అంటూ ఇంకొకరు విమర్శలు గుప్పించారు.
ఇక యాపిల్ కంపెనీ విషయానికి వస్తే.. ఆదాయంలో నంబర్‌వన్ కంపెనీగా ఉన్నప్పటికీ.. గత ఏడాది నిరాశాజనక ప్రదర్శన చేసింది. తమ ఫ్యాక్టరీలు ఎక్కువగా చైనాలోనే ఉండగా.. అక్కడ కరోనా విజృంభణతో సేల్స్‌పై ప్రభావం పడింది. ఇదే క్రమంలో యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కూడా తన వేతనాన్ని భారీగా తగ్గించుకునేందుకు ముందుకొచ్చారు.