Monday, March 20, 2023

KL Rahul కి గౌతమ్ గంభీర్ సపోర్ట్.. హుందాగా చురకలేసిన మాజీ ఓపెనర్

భారత సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul)కి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్.. రెండింటిలోనూ ఫెయిలయ్యాడు. దాంతో అతనిపై వేటు వేసి యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్‌కి ఛాన్స్ ఇవ్వాలని గత 4-5 రోజులుగా డిమాండ్ ఊపందుకుంది.

శుభమన్ గిల్ గత జనవరిలో 4 సెంచరీలు నమోదు చేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. అలానే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కూడా గిల్ నిలిచాడు. కానీ తొలి రెండు టెస్టుల్లోనూ అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ని ప్రదర్శన ఆధారంగా కాకుండా ఫేవరిటిజంతోనే జట్టులోకి తీసుకుంటున్నారని భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ విమర్శలు స్టార్ట్ చేశాడు. ఆ విమర్శలకి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కౌంటరిస్తూ రాహుల్‌కి సపోర్ట్‌గా నిలిచాడు.

ఈ గొడవలోకి మరికొంత మంది భారత క్రికెటర్లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో.. కేఎల్ రాహుల్‌ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు భారత సెలెక్టర్లు కూడా మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోతున్న 3, 4వ టెస్టుకి కేఎల్ రాహుల్‌ని ఎంపిక చేసినా.. వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రం అతడ్ని తప్పించారు. దాంతో మూడో టెస్టుకి అతనిపై వేటు పడనుందని ప్రచారం జరుగుతోంది. తొలి రెండు టెస్టులకీ రాహుల్ వైస్ కెప్టెన్ కావడంతోనే వేటు పడలేదని వార్తలు వచ్చాయి.

కేఎల్ రాహుల్‌పై విమర్శలు పెరగడంతో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ‘‘ఇప్పుడు కేఎల్ రాహుల్‌ గురించి మాట్లాడుతున్న చాలా మందికి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడటం ఎంత కష్టమో తెలియదు. ఒక ప్లేయర్ ఫామ్ కోల్పోయినప్పుడు అతనికి మద్దతు చాలా అవసరం. ఏ ప్లేయర్ కూడా ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయలేడు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఎదురవుతాయి. కానీ.. టాలెంట్ ఉన్నవారికి మనం మద్దతుగా నిలవాలి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news